Jayaprada: అలనాటి హీరోయిన్, మాజీ ఎంపీ జయప్రదకు ఎగ్మోర్ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఓ కేసు విషయంలో సమాజ్ వాదీ పార్టీ మాజీ ఎంపీ జయప్రదకు ఆరు నెలలు జైలుశిక్ష విధిస్తు ఎగ్మోర్ కోర్టు తీర్పునిచ్చింది. శుక్రవారం (ఆగస్టు11,2023) ‘జయప్రద’ థియేటర్ కాంప్లెక్స్ నిర్వహణకు సంబంధించిన కేసులో జయప్రదతో పాటు మరో ముగ్గురికి జైలు శిక్షతో పాటు రూ.5,000లు జరిమానా విధించింది.
చెన్నైలోని రామపేటలో జయప్రదకు ఓ సినిమా థియేటర్ ఉంది. చెన్నైకి చెందిన రామ్ కుమార్, రాజబాబుతో పాటు జయప్రద ఈ థియేటర్ నడిపించగా రాను రాను ఈ థియేటర్ నష్టాలపాలైంది. నష్టాలు భరించలేక వీరంతా థియేటర్ ను మూసివేశారు. దీంతో థియేటర్ నిర్వహణలో కార్మికుల నుంచి ఈఎస్ఐ కోసం వసూలు చేసిన మొత్తాన్ని లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కు చెల్లించాల్సినది యాజమాన్యం చెల్లించలేదు.
దీంతో కార్మికులతో పాటు కార్పొరేషన్ కూడా ఎగ్మూరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసు విచారణ కొనసాగుతున్న క్రమంలో తాజాగా సంచలన తీర్పును వెలువరించింది. కేసు విచారణలో భాగంగా కార్మికులకు చెల్లించాల్సిన మొత్తాన్ని సెటిల్ చేసుకుంటామని..వారికి ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లిస్తామంటూ జయప్రద తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.
ఈ విషయంపై వివరణ ఇస్తు కోర్టులో మూడు పిటిషన్లను కూడా దాఖలు చేశారు. కానీ ధర్మాసనం ఈ పిటీషన్లు కొట్టివేసింది. లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కు సంబంధించిన న్యాయవాది అభ్యంతారాన్ని మాత్రమే పరిగణిలోకి తీసుకుంది. అలా కేసు కొనసాగించి సుదీర్ఘ విచారణ అనంతరం ఈరోజు సంచలన తీర్పును వెలువరించింది. జయప్రదతో పాటు మరో ముగ్గురికి ఆరు నెలల జైలు శిక్ష, ఒక్కొక్కరికీ రూ.5 వేల జరిమానా విధించింది.