Miss Shetty Mr Polishetty : జాతి రత్నాలు ఫేమ్ నవీన్ పొలిశెట్టి , స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తుండగా పి.మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. లవ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాని మొదట ఆగస్టు 4న విడుదల చేస్తామంటూ చిత్రబృందం ప్రకటించింది. అందుకు తగ్గట్లుగా ప్రమోషన్స్ సైతం మొదలు పెట్టింది.
అయితే.. ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు బ్యాలెన్స్ ఉండడం వల్ల సినిమా వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఆ సమయంలోనే త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది. ఈ క్రమంలో ఆగస్టు 18 లేదా 25 తేదీల్లో ఈ సినిమా విడుదల కావొచ్చు అంటూ వార్తలు వినిపించాయి. అయితే.. తాజాగా చిత్ర బృందం రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చేసింది. కృష్ణాష్టమి రోజున అంటే సెప్టెంబర్ 7న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియోను విడుదల చేసింది.
ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లతో పాటు ‘నో నో నో’, ‘హతవిధి’ పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా రావడంతో త్వరలోనే ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాష బాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు మూడేళ్ల తరువాత అనుష్క శెట్టి వెండితెరపై కనిపించనుండడంతో అభిమానుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఎన్నో అవాంతరాలు దాటుకుని సినిమా షూటింగ్ పూర్తి కాగా, పలు మార్లు వాయిదా పడుతూ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. అయితే.. ఈ సారైనా చెప్పిన డేట్ కి విడుదల చేయాలంటూ ఫ్యాన్స్ కోరుతున్నారు.