Sai Dharam Tej : యాక్సిడెంట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని కోలుకొని వచ్చిన సాయిధరమ్ తేజ్ వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల విరూపాక్ష సినిమాతో వచ్చి భారీ విజయం సాధించి ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేశాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో కలిసి సాయి ధరమ్ తేజ్ ‘బ్రో’ (BRO)సినిమాలో నటిస్తున్నాడు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘వినోదయ సితం’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతోంది. తమిళ చిత్రానికి దర్శకత్వం వహించిన సముద్ర ఖనినే ఈ సినిమాకి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తోండగా జూలై 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. బ్రో సినిమా నుంచి రెండో సాంగ్ ని నేడు తిరుపతిలోని ఓ థియేటర్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే సాయిధరమ్ తేజ్ తిరుపతి చేరుకొని చుట్టుపక్కల ఆలయాలని సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్ళాడు సాయిధరమ్ తేజ్.
శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయములో ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేతుడైన శ్రీ సుబ్రమణ్య స్వామికి స్వయంగా హారతి పల్లంతో సాయిధరమ్ తేజ్ హారతి ఇచ్చాడు. ఆలయ పూజరులే హారతులు ఇవ్వాల్సి ఉండగా సాయిధరమ్ తేజ్ హారతి ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. ఆలయ చైర్మన్, ఇతర ఆలయ అధికారుల సమక్షలోనే ఈ ఘటన జరగడంతో సాయిధరమ్ తేజ్ తో పాటు ఆలయ అధికారులపై కూడా విమర్శలు వస్తున్నాయి.పూజారి అంతటి ప్రత్యేక స్థానం ఇవ్వడం ఏంటి అని విమర్శలు వినిపిస్తున్నాయి .