Krishna : సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ ఈ లోకాన్ని విడిచివెళ్ళారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కృష్ణ మృతిపట్ల సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు కృష్ణ మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. కొంతమంది సినీ నటులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీరు పెడుతున్నారు. కాగా కృష్ణ భౌతిక కాయానికి బుధవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
కాగా ప్రస్తుతం కృష్ణ భౌతికకాయాన్ని గచ్చిబౌలిలోని ఆస్పత్రి నుంచి నానక్ రామ్‌గూడలోని ఆయన నివాసానికి తరలించారు. సినీ, రాజకీయ ప్రముఖలు తరలివచ్చి నివాళులర్పిస్తున్నారు. మహేష్ బాబు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలుపుతున్నారు. ఈ సందర్భంగా కృష్ణతో వారికి ఉన్న అనుబంధాన్ని ప్రముఖులు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాగ చైతన్య, విజయ్ దేవరకొండ, కేటిఆర్ , తెలంగాణ సిఎం కేసిఆర్ , తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కృష్ణ పార్ధివ దేహానికి నివాళులు అర్పించారు.
కాగా సాయంత్రం 5 గంటల సమయంలో కృష్ణ భౌతిక కాయాన్ని నానక్ రామ్‌గూడ నివాసం నుంచి గచ్చిబౌలి స్టేడియానికి తరలిస్తారు. అక్కడే ప్రజలు, అభిమానుల సందర్శనార్థం రేపు (బుధవారం) ఉదయం వరకు ఉంచుతారు. బుధవారం ఉదయం పద్మాలయ స్టూడియోస్‌కు తరలించి, కొన్ని ఆచార కార్యక్రమాలు పూర్తయ్యాక మధ్యాహ్నం 2గంటల సమయంలో జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంకు కృష్ణ భౌతికకాయాన్ని తరలిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3గంటల సమయంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను పూర్తి చేయనున్నారు.