బతుకు కుక్కలు చింపిన విస్తరి అయిందనే సామెత మనందరికీ తెలిసిందే…! ఆ సామెతను ఈ కుక్కలు నిజం చేశాయి. ఎలాగంటారా? కాసులు పండిస్తుందని ఆశపడి కొన్న లాటరీ టిక్కెట్ ని కోరల మధ్య పెట్టి కొరికేశాయి. అమెరికాలోని ఓరెగాన్ లో ఇటీవల జరిగిన ఈ ఘటన ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. అమెరికాలోని ఓరెగాన్ కు చెందిన నాథన్, రేచల్ లామెట్ అనే దంపతులు అప్పుడప్పుడూ లాటరీ టికెట్లు కొంటుంటారు. అదే క్రమంలో ఇటీవల ఓరెగాన్ కౌంటీ ప్రభుత్వం నిర్వహించే ఫారో డోల్డ్ క్రాస్ వర్డ్ లాటరీ టికెట్ ను మూడు డాలర్లు (సుమారు రూ. 240) కొన్నారు. ఇంట్లో ఓ టేబుల్ పై ఆ లాటరీ టికెట్ ను పెట్టారు.
అయితే ఈ దంపతులు అలాస్కన్ క్లీ జాతికి చెందిన రెండు కుక్కలు యాపిల్, జాక్ లను పెంచుకుంటున్నారు. ఇల్లంతా ఉత్సాహంగా తిరిగే యాపిల్, జాక్ శునకాలకు టేబుల్ పై ఉన్న లాటరీ టికెట్లపై కన్నుపడింది. అటూ ఇటూ తిరుగుతూ వాటిని కొరికేశాయి. ఇది చూసిన వాటి యజమానులు టికెట్ ముక్కలను తీసి ఓ పక్కన పెట్టారు. లాటరీ డ్రా తీసిన రోజున తమ టికెట్ కు బహుమతి వచ్చిందని తెలిసి నాథన్, రేచల్ లామెట్ దంపతులు హతాశులయ్యారు. తమ వద్ద ఉన్న లాటరీ టికెట్ ను కుక్కలు కొరికేశాయని దానిని పరిశీలనలోకి తీసుకోవాలని కోరారు.
లాటరీ సిబ్బంది సూచన మేరకు టికెట్ ముక్కలను తీసుకెళ్లి వారికి ఇచ్చారు. ఆ ముక్కలన్నింటినీ అతికించిన లాటరీ నిర్వాహకులు దానిపై ఉన్న నంబర్ ను చూసి లాటరీ మొత్తాన్ని నాథన్ దంపతులకు ఇచ్చారు. మొత్తానికి కుక్కలు పొరపాటు చేసినా లాటరీ నిర్వాహకులు మాత్రం దయ తలచి బహుమతి మొత్తాన్ని ఇచ్చారు. కానీ, మనమిక్కడ ఓ మాట చెప్పుకోక తప్పదు సుమండీ…! పాపం, మూగ జీవాలు… వాటికి మాత్రం ఏం తెలుసూ, అది లాటరీ టిక్కెట్ అనీ, వాటికి డబ్బులొస్తాయనీ…! ఏదో, అక్కడ కనిపించాయి. సరదాగా కొరికేశాయి.