Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజుపై మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ అభిమానులు మండిపడుతున్నారు. ఒక డబ్బింగ్ సినిమా కోసం తెలుగులో స్టార్ హీరోలు అయిన చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు అడ్డుపడతావా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అలానే ఈ విషయంపై చిరు, బాలయ్య స్పందించి దిల్ రాజుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి… బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. అలానే నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న చిత్రం వీర సింహారెడ్డి. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ రెండు సినిమాలను నిర్మిస్తోంది. అదే విధంగా ఈ రెండు సినిమాలు సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద పోటీ పడుతున్నాయి. చాలా కాలం తర్వాత సంక్రాంతి బరిలో చిరు, బాలయ్య నిలవడంతో అందరి దృష్టి ఈ సినిమాలపై పడింది. బాక్సాఫీసు వద్ద ఈ బడా హీరోల ఫైట్ ఎలా ఉండబోతోందో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ రెండు సినిమాల మధ్యలోకి ‘వారసుడు’ చిత్రం రాబోతుంది. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత.
నిజానికి ‘వారిసు’ పేరుతో తమిళంలో రూపొందుతోన్న ఈ సినిమాను ‘వారసుడు’గా తెలుగులోకి అనువాదం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ సినిమా థియేటర్స్ దిల్ రాజు చేతిలో వున్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు తన డబ్బింగ్ సినిమా కోసం చాలా థియేటర్స్ ను తన చేతిలో వుంచుకుంటున్నాడు అని చిరు మరియు బాలయ్య ఫ్యాన్స్ ఆయనపై మండి పడుతున్నారు. తెలుగు లో చిరంజీవి, బాలకృష్ణ కు వున్న మార్కెట్ లో 10% లేని విజయ్ సినిమా కు అన్ని థియేటర్స్ లాక్ చేయాలని చూడడం ప్యాన్స్ కు మండేలా చేస్తుంది. దీనిపై రాబోయే రోజుల్లో సోషల్ మీడియాలో రచ్చ జరగడం గ్యారంటీ అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.