Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన శైలిలో సినిమాలను నిర్మిస్తూ టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. దిల్ రాజు మొదట డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనే బ్యానర్ ను స్థాపించి నితిన్ హీరోగా దిల్ సినిమాని నిర్మించారు. ఆ సినిమా పెద్ద హిట్ సాధించడంతో అప్పటి నుంచి ఆయన పేరు దిల్ రాజు గా మారిపోయింది. ప్రస్తుతం దిల్ రాజు రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో వస్తున్న RC15 సినిమాను నిర్మిస్తున్నారు.
కాగా పలు భాషల్లో సినిమాలను కూడా తెలుగులోకి అనువదించి నిర్మాతలు రిలీజ్ చేస్తుండడం అందరికీ తెలిసిందే. ఇటీవల మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్’ ను ‘దిల్’ రాజు తెలుగు వారి ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అయినా నిరుత్సాహపడకుండా ఇప్పుడు మరో తమిళ సినిమాను డబ్ చేసి, రిలీజ్ చేయబోతున్నారు దిల్ రాజు. తమిళ రచయిత, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ రూపొందించిన ‘లవ్ టుడే’ను తెలుగు లోకి డబ్ చేస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇదే నెల 4న తమిళనాట విడుదలై చక్కని విజయాన్ని అందుకుంది. ఇవానా నాయికగా నటించిన ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్, సత్యరాజ్, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం సినిమాకి ప్లస్ అని చెప్పాలి.
ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు తెలుగులో రిలీజ్ చేస్తున్న విషయాన్ని మూవీ హీరో, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ అధికారికంగా తెలిపారు. ఇప్పటికే డబ్బింగ్ వర్క్ పూర్తయిన ఈ సినిమా ఇదే నెల 18న రిలీజ్ అవుతున్నట్టు తెలుస్తోంది. యువతరం మెచ్చే అంశాలతో, కాలేజీ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా తెలుగు వారికీ కనెక్ట్ అవుతుందనే నమ్మకంతోనే ‘దిల్’ రాజు పంపిణీ చేస్తున్నారని అంతా అనుకుంటున్నారు. చూడాలి మరి ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని…