Dipika Kakar: ప్రముఖ బుల్లితెర నటి దీపికా కక్కర్(Dipika Kakar) కీలక నిర్ణయం తీసుకుంది. యాక్టింగ్‌కు గుడ్ బై చెప్పింది. ఇక తాను నటించనని తెలిపింది. ఆమె నిర్ణయానికి భర్త షోయబ్ ఇబ్రహీం కూడా మద్దతు పలికాడు. దీపికా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఓ కారణం ఉంది. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి నిర్ణయం తీసుకున్నావు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ప్రస్తుతం దీపిక గర్భవతి. ఈ ఏడాదిలో ఆమె ఓ శిశువుకు జన్మనివ్వనుంది. ఈ క్రమంలో తన కుటుంబానికి, పుట్టబోయే చిన్నారికి తన పూర్తి సమయాన్ని కేటాయించాలని ఆమె నిర్ణయం తీసుకుంది. అందుకోసం తనకు ఇష్టమైన నటనకు వీడ్కోలు చెబుతున్నట్లు తెలిపింది.
ఇక తాను చిన్న వయస్సులోనే నటించడం ప్రారంభించినట్లు తెలిపింది. దాదాపు 10 నుంచి 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నానని, గర్భం దాల్చిన తరువాత పని చేయడం ఇష్టం లేదని, అందుకనే నటన నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పింది. తాను గృహిణిగా తల్లిగా మిగిలిన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను అని దీపిక తెలిపింది. నెటీజన్లు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. మంచి నిర్ణయం తీసుకున్నావు అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.
‘ససురల్ సిమర్ కా’ అనే షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది దీపికా కాకర్. సహనటుడు అయిన షోయబ్ ఇబ్రహీంను 2018లో పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది మొదటి నెలలో తాము తల్లిదండ్రులను కాబోతున్నట్లు ఈ జంట సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.” కృతజ్ఞత, సంతోషం, ఉత్సాహం మరియు భయాందోళనలతో నిండిన హృదయాలతో ఈ వార్తను మీ అందరితో పంచుకుంటున్నాము. మా జీవితంలో ఇది అత్యంత అందమైన దశ. అవును మేము మా మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నాము! త్వరలో మాతృత్వాన్ని స్వీకరించబోతున్నాను. మా చిన్నారి కోసం మీ ప్రార్థనలు, ప్రేమ చాలా అవసరం.” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు.