ఒక్కోసారి చిన్న పొరపాటు ఎక్కడికి దారి తీస్తుందో చెప్పలేం. అలాగే, పొరపొచ్చాలు కూడా ఎక్కడికి దారి తీస్తాయో మనం ఊహించలేం. ఇటీవలే హీరో రామ్ తో ‘ది వారియర్’ చిత్రాన్ని రూపొందించిన దర్శక నిర్మాత లింగుస్వామికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది ప్రస్తుతం.
చెక్‌బౌన్స్ కేసులో చెన్నైలోని సైదాపేట్ కోర్టు లింగుస్వామికీ, ఆయన సోదరుడైన సుభాష్ చంద్రబోస్ కీ ఆరు నెలల జైలు శిక్ష విధించింది.
వివరాల్లోకెళితే… కొన్ని సంవత్సరాల క్రితం కార్తి, సమంత జంటగా ‘ఎన్నిఇజు నాల్ కుల్ల’ పేరుతో ఓ సినిమాను రూపొందించాలని లింగుస్వామి, సుభాష్ సంకల్పించారు. కర్ణుడి చావుకు కారణాలు సవాలక్ష అన్నట్టుగా ఏ కారణాలవల్లో ఆ సినిమా పట్టాలెక్కలేదు. అయితే, ఈ సినిమా నిర్మాణం కోసం ఈ సోదర ద్వయం పీవీపీ సినిమాస్ వారి దగ్గర అప్పు తీసుకున్నారు. ఇక సినిమా నిర్మాణం హుష్ కాకి కావడంతో ఆ మొత్తాన్ని పీవీపీ సినిమాస్ వారికి చెక్కు రూపంలో తిరిగిచ్చారు. కాకపోతే, తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్టుగా ఆ చెక్కు కాస్తా బౌన్స్ అయింది. దీంతో పీవీపీ వారు కోర్టును ఆశ్రయించారు. దీంతో కేసు పూర్వాపరాలను పరిశీలించిన సైదాపేట్ కోర్టు తీర్పునిస్తూ లింగుస్వామి సోదర ద్వయానికి ఆరునెలల జైలు శిక్ష విధించింది.
ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్లబోతున్నారు లింగుస్వామి, ఆయన సోదరుడు. పై కోర్టులో ఎలాంటి తీర్పు ఎదురవుతుందనే విషయాన్ని పక్కన బెడితే, ఒక్కోసారి మనుషుల్ని కష్టాలు ముప్పేట దాడి చేస్తాయి. లింగుస్వామి పరిస్థితి కూడా అదే. కార్తి, సమంతలతో అనుకున్న సినిమా రూపుదాల్చలేదు. మరోవైపు ‘ది వారియర్’ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. గతంలో తిరుపతి బ్రదర్స్ ప్రొడక్షన్ హౌజ్ బ్యానర్ పేరుతో కొన్ని సినిమాలను నిర్మించారు లింగుస్వామి. ఆ ప్రొడక్షన్ హౌజ్ మీద కూడా కొన్ని కేసులు వున్నాయిట. చుట్టూ కష్టాల్లో వున్న లింగుస్వామిని ఆ దేవుడే రక్షించాలి.