Assembly elections: భారత దేశం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న గుజరాత్ శాసన సభ ఎన్నికల నగారా నేడు మోగింది. ఈ రాష్ట్ర అసెంబ్లీకు కేంద్ర ఎన్నికల సంఘం నేడు షెడ్యూల్ ను విడుదల చేసింది. గుజరాత్ లో ఈ ఎన్నికలు రెండు దశల్లో జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. మొదటి దశ ఎన్నికలు డిసెంబర్ 1 వ తేదీన, రెండోదశ ఎన్నికలు డిసెంబర్ ఐదువ తేదీన నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ వెల్లడించారు. గుజరాత్ లో డిసెంబరు 1న నిర్వహించే తొలి దశ పోలింగ్ నిర్వహించిన పిమ్మట డిసెంబరు 5న రెండో విడత ఓటింగ్ జరిపించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.
ఈ విడత ఎన్నికలు కేవలం గుజరాత్ కు మాత్రమే కాక హిమాచల్ ప్రదేశ్ లోనూ జరగనున్నాయి. అయితే ఈ రాష్ట్రానికి కూడా డిసెంబరు 8 వ తేదీనే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. హిమాచల్ లో మాత్రం నవంబరు 12 న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. కానీ డిసెంబరు 8 న మాత్రమే కౌంటింగ్ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. నిజానికి ఈ రెండు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికల తేదీలను ప్రకటిస్తారని చాలా మంది అనుకున్నారు. అయితే వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకున్న అధికారులు హిమాచల్‌కు కాస్త ముందుగా షెడ్యూల్ విడుదల చేశారు.
మొదటి దశలో మొత్తంగా 89 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అంతేగాకుండా తరువాతి విడత అయిన రెండో విడతలో 93 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ సారి ఎన్నికల్లో మొత్తంగా 4.9 కోట్ల మంది ఓటర్లు తమ అమూల్యం అయిన ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు తెలిపారు.