వేపగుంట ఆగస్టు 27 : ప్రతి ఒక్కరూ తెలుగులోనే మాట్లాడాలని తెలుగు భాష అభివృద్ధికి అందరూ కృషి చేయాలని సీనియర్ జర్నలిస్ట్, చాన్విక ఫౌండేషన్ చైర్మన్, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విశాఖ జిల్లా పబ్లిక్ రిలేషన్ చైర్మన్ వడ్డాది ఉదయకుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం విశాఖ నగర పరిధిలో గల వేపగుంట ముత్యమాంబ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో తెలుగువీర సంస్థాన్ ట్రస్ట్ నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
పరభాష మోజులో పడి తెలుగు భాషను విద్యార్థి దశనుండే విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాష అభివృద్ధికి కృషిచేసిన గిడుగు రామ్మూర్తి పంతులు సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ముందుగా గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
తెలుగు ఉపాధ్యాయురాలు పార్వతి మాట్లాడుతూ… తెలుగు భాషలో గల ముఖ్యమైన కవులు గురించి వివరించారు తెలుగు భాష అభ్యున్నతికి కృషి చేస్తున్న తెలుగువీర సంస్థాన్ ట్రస్ట్ అధ్యక్షులు దొడ్డి శివకుమార్ ను ఆమె అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తెలుగు భాష పై నిర్వహించిన వ్యాసరచన పోటీలో విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది.
కార్యక్రమంలో చివరగా తెలుగు భాష దినోత్సవం సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు దొడ్డి శివకుమార్ స్వీయ రచన చేసి మౌనిక పబ్లికేషన్స్ ద్వారా ప్రచురితమైన పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథులను ట్రస్ట్ చైర్మన్ శివకుమార్ సత్కరించారు. ట్రస్ట్ చైర్మన్ దొడ్డి శివకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు దుర్గారావు, ట్రస్ట్ సభ్యులు ఆడారి తేజ, రామ్ కుమార్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో సుమారు 200 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు తెలుగు భాష దినోత్సవం పుస్తకాన్ని పంపిణీ చేయడం జరిగింది. అధిక సంఖ్యలో విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.