‘యెదవ జీవితం… క్షణం తీరిక లేదు, దమ్మిడీ ఆదాయం లేదు.’ అని మనల్ని మనం ఎప్పుడూ తిట్టుకుంటూంటాం. నెలకొచ్చే అత్తెసరు జీతాన్ని పాలవాడికింత, పేపరు వాడికింత, ఇంటి అద్దెకింత అని లెక్కలు వేసుకుంటే డబ్బు తక్కువపడి ఇవ్వాల్సిన వాళ్లను మిగతా డబ్బు వచ్చే నెల ఇస్తామని మనసు చంపుకుని మరీ బతిమాలుకుంటాం. అట్టాంటప్పుడు హఠాత్తుగా పెద్దమొత్తంలో డబ్బు చేతికొస్తే ఎంత బావుణ్ణనుకుంటాం.
అమెరికాలోని ఓ నలభై మూడేళ్ల ఆంటీ ఇలాగే ఫైనాన్షియల్ గా ఎన్నో ఇబ్బందులు పడుతోందిట. అలాంటి సందర్భంలో ఏమోలే చూద్దామనుకుని ఒక డాలర్ అంటే మన కరెన్సీలో ఎనభై రూపాయలు పెట్టి మేరీల్యాండ్ దగ్గర్లోని బాల్టిమోర్ లో ఓ ఫుడ్ స్టాప్ కు సామగ్రి కోసం వెళ్లినప్పుడు మేరీలాండ్ స్టేట్ లాటరీ టికెట్ ను కొనుక్కుందిట. తన పాత కారు నంబర్ కు అనుగుణంగా ఐదు నంబర్లతో కూడిన టికెట్ ను యాదృఛ్చికంగా తీసుకుందిట.
అయితే, అదే ఆవిడ మీద అదృష్ట వర్షాన్ని కురిపించింది. ఏకంగా యాభై వేల డాలర్లు… అంటే మన కరెన్సీలో నలభై లక్షల రూపాయల బహుమతి వచ్చి ఆంటీ ఒళ్లో వాలింది. నిజానికి తను కొన్న లాటరీకి అంత పెద్దమొత్తం వస్తుందని ఆవిడ ఎంత మాత్రం ఊహించలేదుట. తను ఒకటికి రెండుసార్లు చూసి, అనుమానంతో తల్లికిచ్చి చూడమందిట.
ఇక ఈ లాటరీ డబ్బులతో తన అప్పులు తీర్చుకుని, ఇంటికి మరమ్మతులు చేయించుకుంటాననీ, కొత్త కారు కొనుక్కుని పిల్లలకు బహుమతులిస్తాననీ ఆవిడ చెప్పుకొచ్చిందిట. ఇంతకు ముందు కూడా ఇలాగే ఓ మహిళ తన సోదరి కలలో కనిపించిన నంబర్లతో లాటరీ టికెట్ తీసుకుని 20 లక్షల రూపాయల బహుమతిని అందుకున్న విషయం కూడా బాగా పాపులరైంది. అద్భుతాలు జరుగుతాయని తెలుసు గానీ, మరీ ఇలాంటి అద్భుతాలా…! దేవుడా… ఓ మంచి దేవుడా… మా జీవితాల్లోనూ ఇలాంటి అద్భుతాలు జరిగేలా చూడవూ… చూస్తావు, నువు చేస్తావు. ఎందుకంటే బేసికల్ గా నువ్వు గాడ్ వి కదా…!!