Viral News : సికింద్రాబాద్ కస్తూర్బా గాంధీ కాలేజీ సైన్స్ ల్యాబ్ లో కెమికల్ గ్యాస్ లీక్ అయ్యింది. దీంతో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు ల్యాబ్ లో ప్రయోగాలు చేస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే స్పందించిన కాలేజీ యాజమాన్యం విద్యార్థినులను స్థానిక ఆసుపత్రికి తరలించింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు.
కాగా గ్యాస్ ఎలా లీక్ అయింది అనేది తెలుసుకునే పనిలో పడ్డారు. కాగా గ్యాస్ లీక్ అయి విద్యార్థినులు అస్వస్థతకు గురవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కాగా మొదట కాలేజీ సైన్స్ ల్యాబ్ నుంచి గ్యాస్ లీక్ అయిందని వార్తలు వస్తే… యాజమాన్యం మాత్రం అసలు సైన్స్ ల్యాబ్ ఓపెన్ చేసే లేదని చెబుతోంది. బయటి నుంచి వచ్చిన గ్యాస్ వల్లే విద్యార్థులు స్పృహతప్పి పడిపోయారని కాలేజీ సిబ్బంది అంటున్నారు. ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు క్లూస్ టీమ్ తో కాలేజీ దగ్గరికి చేరుకున్నారు. కాలేజీ పరిసరాలతో పాటు ల్యాబ్ ని పరిశీలించారు.
యాజమాన్యం, విద్యార్థినులతో మాట్లాడి వివరాలు సేకరించారు. గ్యాస్ ఎక్కడి నుంచి లీక్ అయ్యింది? విద్యార్థినులు ఎలా స్పృహ తప్పి పడిపోయారు? ఆరా తీస్తున్నారు. మరోవైపు తమ పిల్లలకు ఏం జరిగిందో తెలియక తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు పెద్ద సంఖ్యలో కాలేజీకి చేరుకుంటున్నారు. ఈ ఘటనలో 41 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురవడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారింది.