Great Legend Singer SP Balu 75th Jayanthi Celebrations, Director N Shankar, Music Director RP Patnaik, Telugu Film Industry Swaraneerajanam,
బాలు గారి 75వ జయంతి సందర్బంగా ఉ. 10 గం నుంచి రాత్రి 10 గం వరకూ 12 గంటల పాటు లైవ్ ప్రోగ్రామ్.
FILM NEWS: జూన్ 4న బాలు గారి జయంతి సందర్బంగా బాలుకి “తెలుగు చిత్ర సీమ స్వరనీరాజనం”
ఆ పాట అధరామృతం.. ఆ గానం గంధర్వ గానం. ఆయన గళం విప్పితే పాటే ఆయనకు ప్రణమిల్లుతుంది. అందుకే ఆయన గాన గంధర్వుడయ్యారు. స్వర బ్రహ్మగా జన నీరాజనాలు అందుకుంటున్నారు. శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం మన బాలు అయ్యారంటే ఆయన కృషి పాలు ఎంతుందో మనకు అర్థమవుతుంది. బాలు పాటల పూదోటలో శ్రోతలు విహరించినప్పుడు ఆ మకరందాన్ని గ్రోలకుండా ఎలా ఉంటారు. మనకు ఆయన పాటలే సంజీవని మంత్రాలు. ఆ స్వరబ్రహ్మ 75వ జయంతి (డైమండ్ జూబ్లీ) సందర్భంగా తెలుగు చిత్ర సీమ ఆయన జయంతి రోజైన జూన్ 4వ తేదీన స్వరనీరాజనం అందించబోతోంది. బాలు గానంలో కోటి రాగాలు, శతకోటి స్వరాలు.. అనంతకోటి తాళాలు.. ఆ పల్లవులు మన మదిని తాకుతాయి.. ఆ చరణాలు మన హృదిని దోచేస్తాయి. ఆయన మన బాలుడు అనడం కన్నా ఆబాలగోపాలానికి ఆరాధనీయుడు అనడంలోనే ఆనందం ఉంటుంది. అందుకే బాలు పట్ల తనకున్న ఆరాధనను చిత్రసీమ వ్యక్తం చేసుకోబోతోంది. బాలుకు గ్రాండ్ ట్రిబ్యూట్ నిర్వహించబోతోంది. తెలుగు సినిమాకే కాకుండా భారతీయ సినిమాకి బాలు చేసిన సేవల్ని గుర్తు చేస్తూ ఆయనకు ఘననివాళి అర్పించబోతోంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ 12 గంటలపాటు లైవ్ ప్రోగ్రామ్ ను తెలుగు చిత్ర పరిశ్రమ ఏర్పాటు చేయబోతోంది. ఇందులో అతిరథమహారథులైన తెలుగు హీరోలు, దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు, పాటల రచయితలు పాలు పంచుకోబోతున్నారు. ఆ రోజును బాలుకు అంకితం చేయబోతున్నారు. తెలుగు సినిమా రంగం ఒక్క తాటిపైకి వచ్చి అంతర్జాలం వేదికగా చేపడుతున్న బృహత్తర కార్యక్రమమిది. ఆ గుండె గొంతుక ఎప్పటికీ మూగవోదని, ఆయన పాటలోని మాధుర్యం ఎన్నటికీ తరగబోదని చాటబోతున్నారు. బాలూ స్మరణలోనే ఆయన భక్తులుంటారని చిత్ర పరిశ్రమకు తెలుసు. అందుకే బాలూకు స్వరనీరాజనంతో అంజలి ఘటించేందుకు చిత్ర పరిశ్రమ సిద్దమైంది.
ఈ కార్యక్రమంపై డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్. శంకర్ మాట్లాడుతూ ‘బాలూ గారి జయంతిని పురస్కరించుకుని తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారంతా ఆరోజుని బాలుగారికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. వారి గౌరవార్థం తెలుగు సినిమాకే కాకుండా భారతీయ సినిమాకి బాలుగారు చేసిన సేవల్ని గుర్తుచేస్తూ సినీ ప్రముఖులంతా ఇందులో పాల్గొనబోతున్నారు. ఇది దాదాపు 12 గంటలపాటు లైవ్ ప్రోగ్రామ్ గా కొనసాగుతుంది. దీనికి పరిశ్రమ అంతా సహకరిస్తోంది. సంగీతాభిమానలు, బాలుగారి అభిమానులు ఇందులో పాల్గొనాలని కోరకుంటున్నాను’ అన్నారు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ ‘జూన్ 4 న బాలు గారికి పెద్ద ట్రిబ్యూట్ ప్రోగ్రామ్ చేయాలని నిశ్చయించుకున్నాం. ఇందులో ఇండస్ట్రీ అంతా పాల్గొంటుంది. మా అసోసియేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్, నిర్మాతలు, సంగీత దర్శకులు, పాటల రచయితలు.. ఇలా అందరూ ఇందులో పాల్గొంటారు. నాన్ స్టాప్ గా జరిగే ఈ ప్రోగ్రామ్ ని చూసి అందరూ జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన అప్ డేట్స్ ఇస్తాం’ అని వివరించారు.