సాధారణంగా మనకు సెలవు కావాలంటే బాస్ దగ్గరకెళ్ళి కరెక్ట్ రీజన్ చెప్తేనే వర్కవుట్ అవుతుంది. లేకపోతే, ‘ఏంటయా బాబూ, దీనికీ సెలవు కావాలా?’ అన్నట్టు ఓ లుక్కివగానే మన పై ప్రాణాలు పైనే పోతాయి. దాదాపుగా ఎవరికైనా బాస్ దగ్గర సెలవు సంపాదించాలంటే కొంచెం కష్టమే…! ఇంకొందరికైతే మరీ కష్టంగా వుంటుంది. అట్టాంటిది ‘బాబ్బాబూ, మాయావిడ అలిగింది. బుజ్జగించడానికో వారం రోజులు సెలవు కావాలి.’ అని అడిగితే ఇంకేమైనా వుందా? నడుస్తున్న వోల్వా బస్సులో నుండి అద్దాలు బద్దలు గొట్టుకుని బయటికొచ్చినట్టుండదూ…! కానీ, ఓ ప్రబుద్ధుడు మాత్రం సరిగ్గా ఇదే రీజన్ చెప్పి ఐదు రోజులు సెలవు కొట్టేశాడు.
అలిగిన తన భార్యను బుజ్జగించేందుకు సెలవు కావాలంటూ తనపై అధికారికి ఓ కానిస్టేబుల్ రాసిన లీవ్ లెటర్ సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ గౌరవ్ చౌధరికి గతేడాది డిసెంబరులో వివాహమైంది. పెళ్లయిన కొన్ని రోజులకే భార్యను ఇంటి వద్ద వదిలి డ్యూటీలో తిరిగి చేరాడు. ఆ తర్వాతి నుంచి మళ్లీ ఇంటికి వెళ్లలేదు. దీంతో భర్తపై అలిగిన ఆమె ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం మానేసింది. దీంతో భార్య తనపై అలిగిందని నిర్ధారణ కొచ్చిన గౌరవ్ సెలవుపెట్టి ఇంటికెళ్లి ఆమెను బుజ్జగించాలని నిర్ణయించుకున్నాడు.
వెంటనే తన పై అధికారి అయిన ఏఎస్పీకి లీవ్ లెటర్ రాస్తూ.. పెళ్లయిన వెంటనే తన భార్యను వదిలి వచ్చినందుకు ఆమె తనపై అలిగిందని, ఫోన్ చేసినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఫోన్ కట్ చేస్తోందని, కొన్నిసార్లు ఫోన్ ఎత్తినా మాట్లాడమని ఆమె తల్లికి ఇస్తోందని వాపోయాడు. కాబట్టి అలిగిన తన భార్యను బుజ్జగించేందుకు తనకు వారం రోజుల సెలవు కావాలని ఆ లీవ్ లెటర్‌లో విజ్ఞప్తి చేశాడు.
ఆ లేఖ చూసి గౌరవ్ బాధను అర్థం చేసుకున్న ఏఎస్పీ ఐదు రోజుల సెలవు మంజూరు చేశారు. ఇప్పుడీ లీవ్ లెటర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ సెలవిచ్చిన మగానుభావుడెవరో మన ఆఫీసులోనూ వుంటే ఎంత బావుణ్ణేది అని ఆలోచిస్తున్నారా? కొన్ని కొన్ని సబ్ జగే మే నై చల్తా… ఖుదా గవా…!!