సాధారణంగా పోలీసుల్ని సినిమాల్లో హీరోల్లా చూపిస్తారు, కొన్ని సినిమాల్లో విలన్లుగా చూపిస్తారు. ప్రతి వ్యవస్థలోనూ మంచి, చెడు రెండూ వున్నట్టుగానే పోలీస్ వ్యవస్థలో సైతం మంచి, చెడు రెండూ వున్నాయి. నిజమైన పోలీసుల్లో సైతం నిజాయితీపరులు వున్నారని అప్పుడప్పుడూ నిరూపించబడుతుంది.
సరిగ్గా ఇలాంటి సంఘటనే రాయపూర్ లో జరిగింది. నీలాంబర్ సిన్హా అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ నవ రాయపూర్ లోని కాయబంధ చెక్ పాయింట్ వద్ద తన విధుల్ని ముగించుకుని ఇంటికి వెళుతుండగా దారిలో ఒక బ్యాగ్ కనిపించింది తెరచి చూస్తే ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నలభై ఐదు లక్షల రూపాయలు కనిపించాయి. అన్నీ రెండు వేలు, ఐదు వందల రూపాయల నోట్లే.
అంత డబ్బును ఒకేసారి చూసినప్పటికీ మనసు తప్పుదోవ పట్టకుండా మరో ఆలోచన లేకుండా నీలాంబర్ ఆ నలభై ఐదు లక్షలను తీసుకుని నేరుగా దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఇచ్చి తన నిజాయితీని చాటుకున్నాడు. పోలీసులు అతడి నిజాయితీకి మెచ్చి రివార్డును ప్రకటించారు. ఆ డబ్బు ఎక్కడిదనే ఇన్వెస్టిగేషన్ ని మొదలుపెట్టారు పోలీసులు. అయితే, నెట్ లో ఇది చూసిన నెటిజన్లు నీలాంబర్ సిన్హాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.