కొన్ని పెద్ద పెద్ద సంఘటనలకు చిన్న కారణాలుంటాయి. తీరా ఘోరం జరిగిపోయాక అతి చిన్నదైన మూల కారణాన్ని గనక వింటే ‘దీని కోసమా ఇంత దారుణం జరిగింది?’ అనిపించక మానదు. నిత్యం ఇలాంటి దారుణాలు ఎన్నెన్నో వెలుగు చూస్తూనే వుంటాయి. కారణాలేమైనప్పటికీ ప్రాణాలు మాత్రం గాల్లో కలసిపోతాయి. తర్వాత ఆలోచించినా ఏమీ లాభం వుండదు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న చందంగా వుంటుంది. మధ్యప్రదేశ్ లో ఇలాంటి దారుణమే ఒకటి జరిగింది.
పక్కింటి దంపతుల వివాదంలో తలదూర్చి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఛవాని పత్తర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. అసలేం జరిగిందంటే, పప్పు అహిర్వార్ అనే వ్యక్తి తన భార్య చికెన్ వండేందుకు నిరాకరించడంతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దాంతో సహనం కోల్పోయిన పప్పు అహిర్వార్ భార్యను కొట్టడం ప్రారంభించాడు. ఈ గొడవకు ఇరుగుపొరుగువారు అక్కడ గుమికూడారు. వారిలో బాబు అహిర్వార్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. బాబు సహా ఇతరులు ఆ భార్యాభర్తలకు సర్దిచెప్పారు.
విషయం అంతటితో సద్దుమణిగిందని అందరూ భావించారు. కానీ పప్పు అహిర్వార్ బాబు అహిర్వార్ పై కోపం పెంచుకున్నాడు. బాబు అహిర్వార్ ఇంటికి వెళ్లి కర్రతో దాడి చేశాడు. ఈ ఘటనలో బాబు అహిర్వార్ కు తీవ్రగాయాలయ్యాయి. అతడిని స్థానికులు హమీదియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించాడని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పప్పు అహిర్వార్ ను అరెస్ట్ చేశారు. ఇప్పుడు పప్పు అహిర్వార్ కి ఎంత పెద్ద శిక్ష పడినా లాభం లేదు. ఎందుకంటే, గొడవపడొద్దని నచ్చజెప్పిన పాపానికి బాబు అహిర్వార్ ప్రాణాలు అనంత వాయువుల్లో కలసిపోయాయి. కటకటాల వెనక్కి వెళ్లిన తరువాత ఒకవేళ పప్పు అహిర్వార్ పశ్చాత్తాపపడినా ఏమీ ఉపయోగం వుండదు.