ఐటీ ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్ మరోసారి సత్తా చాటింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2022-23) తొలి త్రైమాసికం (క్యూ-1)లో అత్యధిక ఐటీ ఉద్యోగాలు కల్పించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోని మెట్రో నగరాల్లో ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో కొత్తగా 4.5 లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు లభించాయని, ఇందులో అత్యధికంగా 1,53,000 నియామకాల (34% వాటా)తో హైదరాబాద్ ప్రథమ స్థానంలో నిలిచిందని ‘క్వెస్ ఐటీ స్టాఫింగ్’ తాజా నివేదికలో ప్రకటించింది. ఈ జాబితాలో హైదరాబాద్ తర్వాత బెంగళూరు (1,48,500), ముంబై (54,000), పుణె (40,500), చెన్నై (22,500) ఉన్నట్టు వెల్లడించింది.
డాటా అనలిటిక్స్, జావా టెక్నాలజీస్, క్లౌడ్ ఇన్‌ఫ్రా టెక్నాలజీస్, ఫుల్ స్టాక్ టెక్నాలజీస్, యూఐ, యూఎక్స్ లాంటి డిజిటల్ నైపుణ్యాలు ఉన్నవారికి ఈ 5 నగరాల్లో ఎక్కువ డిమాండ్ ఉన్నట్టు క్వెస్ ఐటీ స్టాఫింగ్ సీఈవో విజయ్ శివరామ్ వివరించారు. ప్రస్తుతం పలు కంపెనీలు తమ కార్యకలాపాలను ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తుండటంతో నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్)తోపాటు అహ్మదాబాద్, కోల్‌కతా, భువనేశ్వర్, జైపూర్ లాంటి నగరాల్లో కూడా ఐటీ ఉద్యోగుల నియామకాలు పెరిగినట్టు తెలిపారు. ఆ నగరాల్లో దాదాపు 31 వేల ఐటీ ఉద్యోగ నియామకాలు జరిగినట్టు వెల్లడించారు. డిజిటల్ అప్లికేషన్ల వినియోగం అధికమవడంతో వివిధ రంగాల్లో డిజిటల్ టెక్నాలజీ నిపుణులకు గిరాకీ పెరిగినట్టు పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్పత్తులు, ఆటోమోటివ్, ఇంజినీరింగ్, బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్), టెలి కం, కన్సల్టింగ్ లాంటి రంగాల్లో డిజిటల్ టెక్ నిపుణులకు ఎక్కువ డిమాండ్ ఉన్నట్టు విజయ్ శివరామ్ వెల్లడించారు.