తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అన్ని రంగాల్లో శరవేగంగా ముందుకు దూసుకెళ్తున్న హైదరాబాద్ ఇప్పుడు మరో ఘనత సాధించింది. ఆఫీస్ స్పేస్ వినియోగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి భారత సిలికాన్ వ్యాలీగా పేరు పొందిన బెంగళూరును అధిగమించింది. తద్వారా దేశంలో హైదరాబాద్ అగ్రస్థానానికి దూసుకెళ్లినట్టు ప్రముఖ కమర్షియల్ రియల్ ఎస్టేట్ వ్యాపార అధ్యయన సంస్థ ‘వెస్టియన్’ తన తాజా నివేదికలో వెల్లడించింది. ‘హైదరాబాద్ 2.0’ పేరుతో విడుదలైన ఈ నివేదికలో 2016 నుంచి 2022 వరకు ఐటీ, ఐటీఈఎస్, ఫార్మా, బయోటెక్నాలజీ, లాజిస్టిక్స్ తదితర పలు రంగాల్లో నమోదైన అభివృద్ధిని విశ్లేషించారు. 2019లో హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ మార్కెట్ ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి చేరి, సుమారు 1.15 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ వినియోగంలోకి వచ్చినట్టు తెలిపారు.
కొవిడ్ సంక్షోభ సమయంలోనూ హైదరాబాద్ మార్కెట్ చాలా స్థిరంగా ఉన్నదని, అమెరికా, యూరప్ దేశాల తర్వాత హైదరాబాద్‌లోనే అత్యధిక ఐటీ కంపెనీల ఆఫీసులు ఉన్నాయని వివరించారు. గత ఏడాది హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ డిమాండ్ 69.6 లక్షల చదరపు అడుగులు గా నమోదైందని, 2020 కంటే ఇది 8% ఎక్కువన్నారు. ఈ ఏడాది ప్రథమార్థం (హెచ్1) చివరి నాటికి నగరంలో వ్యాపార సంస్థ లు 44 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకొన్నాయని, ఇది గత ఏడాది ఇదే కాలంలో ఉన్న డిమాండ్ కంటే 72% ఎక్కువని ‘వెస్టియన్’ నివేదిక వెల్లడించింది.