Health News : ఇటీవల కాలంలో విద్యార్థులు, ఉద్యోగులతో సహా అందరూ… కంప్యూటర్, ఫోన్ల వినియోగం బాగా పెరిగిపోయింది. దాంతో… కళ్ల సమస్యలతో బాధపడుతున్నారు. కళ్లు పొడిబారడం, నొప్పి వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఆలస్యంగా పడుకోవటం, నిద్రలేమి సైతం కంటిపై ప్రభావం చూపిస్తుంది. ఈ ఇబ్బందికి గురికాకుండా ఉండాలంటే… అలసట లక్షణాలను గుర్తించి కళ్లకు విశ్రాంతిని ఇవ్వాలంటున్నారు… వైద్యులు.
కళ్ల మసకలు, నీరు కారడం, తలనొప్పి, కంటి మంటలు వంటి లక్షణాలు కనిపిస్తుంటే … కళ్లు అలసిపోయాయని అర్థం చేసుకోవాలి. ఇలాంటప్పుడే కళ్లకు విశ్రాంతి ఇచ్చేందుకు ప్రయత్నించాలి. ఇందుకోసం… కంటి చుక్కలతో పాటు ప్రత్యమ్నాయ ప్రయత్నాలు చేయడం మంచిది అంటున్నారు నిపుణులు. ఇందుకోసం కొన్ని రకాల కంటి యోగాను సూచిస్తున్నారు.
కంప్యూటర్ తెరముందు ఎక్కువగా కూర్చునే వాళ్లు.. ప్రతి రెండు గంటలకోసారి 10 నిమిషాల పాటు కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి. రెండు అరచేతుల్నీ వేడెక్కే వరకూ రుద్ది…రెప్పల మీద ఉంచింతే… కొంచెం ఉపశమనం కలుగుతుంది. అలానే… చల్లని నీటిలో తడిపి దూదిని మూసిన కనురెప్పలపై 5 నిమిషాల పాటు ఉంచితే కళ్లకు కొద్దిగా చల్లదనం లభిస్తుంది. దాంతో… కళ్ల మంటలు కొద్దిగా తొలగిపోతాయి. కనుగుడ్లను సవ్య, అపసవ్య దిశల్లో తిప్పాలి. కళ్లను పైకి, కిందకి తిప్పుతుండాలి… ఒక వేలిని కళ్లకు కొద్ది దూరంలో ఉంచి, కొద్దిసేపు దాన్నే చూడాలి. తర్వాత వేలిని కుడి, ఎడమ దిశల్లో తిప్పుతూ… దాన్నే చూస్తూ ఉండాలి. రోజుకు కనీసం 7 గంటలైన నిద్రపోవాలి. కంటి నుండి నీరు కారుతున్నా, లేదా దురదలు పెడుతున్నా కళ్లు నులుముకోకుండా వైద్యుల్ని సంప్రదించాలి.