Vinayaka Pooja Vidhanam వినాయక చవితి అంటేనే పిల్లలు, పెద్దలు ఆనందంగా చేసుకునే పండగ. అన్నిచోట్ల అప్పుడే వినాయక చవితి సందడి మొదలైపోయింది. వినాయకుడి పుట్టిన రోజైన ‘భాద్రపద శుద్ధ చవితి’ రోజునే ‘వినాయక చవితి’ పండుగను హిందువులు జరుపుకుంటారు. ఈ సంవత్సరం వినాయక చవితి బుధవారం నాడు వచ్చింది అయితే గణపతిని ఆ రోజున ఏ సమయంలో, ఎలా పూజిస్తే మంచిదో ఒకసారి చూద్దాం..
బుధవారం రోజున వర్జ్యం సమయంలో పూజ చేయరాదు. బుధ గ్రహ, కేతు గ్రహ కాలాల్లో వినాయక పూజ చేయడం చాలా మంచిది. బుధవారంకి అధిపతి బుధుడు. ఎవరైతే చదువులో, ఉద్యోగంలో, వ్యాపారంలో రాణించాలి అనుకుంటున్నారో వాళ్లు వినాయకుని ఈ విధంగా పూజించడం చాలా మంచిది.
వినాయకుని పెట్టే పీట మీద ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని కప్పి ఉంచి మట్టితో చేసిన వినాయక ప్రతిమను ఉంచాలి.అగరువత్తులు వెలిగించి, దీపారాధన చేయాలి. వినాయకుడు పైన పాలవెల్లిని ఉంచి.. ఆ పలవెల్లిని పళ్లతో, పూలతో అలంకరించాలి. ఎర్రని మందార, గులాబీ పుష్పాలతో వినాయకుడిని పూజించాలి. దేవుని ముందు పత్రిని సమర్పించాలి. నేతితో చేసిన ఉండ్రాళ్ళని, పాల తాలికలను నైవేద్యంగా పెట్టాలి. వెలగ పళ్ళను, గరికను దేవుడు ముందు ఉంచాలి. వీలైతే 11 రకాల నైవేద్యాలతో వినాయకుడిని పూజించడం చాలా మంచిది. వీటన్నిటితో పాటూ వినాయకుడిని పూజించిన తర్వాత సాయంత్రం మరలా వినాయకుడికి నమస్కరించి ఆ అక్షింతలు మాత్రం తలపై వేసుకోవడం తప్పనిసరి.