Dulquer Salmaan : మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి (Mammootty) కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan). బాషతో సంబంధం లేకుండా అన్ని రకాల పాత్రలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తెలుగు ప్రేక్షకులకు కూడా ఇతడు సుపరిచితుడే. మహానటి(Mahanati), సీతారామం(Sita Ramam) సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెదరని ముద్ర వేశాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దుల్కర్ ఆదివారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. కాసేపటి తరువాత దాన్ని డిలీట్ చేశాడు. అయితే.. అప్పటికే ఆ వీడియో వైరల్‌గా మారగా, ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆ వీడియోలో ఏముందంటే.. ‘కొంతకాలంగా నిద్రపట్టడం లేదు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఇలాంటి దాన్ని తొలిసారి అనుభవిస్తున్నాను. నా మనస్సు నుంచి దాన్ని తొలగించలేకపోతున్నా. ఇంకా ఏదో చెప్పాలని అనుకుంటున్నా. కానీ చెప్పలేకపోతున్నా’ అంటూ దుల్కర్ సల్మాన్ కళ్లు తుడుచుకుంటూ కనిపించారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా ఏమైంది అంటూ నెటీజన్లు వరుస కామెంట్లు చేయడంతో కాసేపటికే ఆ వీడియోను దుల్కర్ తొలగించారు.
కాగా.. అప్పటికే కొందరు ఆ వీడియోను డౌన్‌లోడ్ చేశారు. ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన దుల్కర్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుల్కర్‌కు ఏమైంది..? అంతా బాగానే ఉందా..? అసలు మీరే చెప్పాలనుకుంటున్నారు..? అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సినిమాల విషయానికి వస్తే.. అభిలాష్ జోషి దర్శకత్వంలో ‘కింగ్ ఆఫ్ కోథా’ చిత్రంలో నటిస్తున్నారు దుల్కర్. జీ స్టూడియోస్ సంస్థతో కలిసి దుల్కర్ తన ప్రొడక్షన్ హౌస్ వెపేరియర్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ కాగా.. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.