Naga Shourya : టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య త్వరలో ఓ ఇంటివాడు అవ్వబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య వంటి సినిమాలు ప్రేక్షకుల్లో తనకు మంచి పేరును తెచ్చికున్న ఈ యంగ్ హీరో… ఆ తర్వాత తెలుగు తెరపై తనకంటూ ప్రత్యేక శైలిలో విభిన్న పాత్రలు, కధాంశాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే కృష్ణ వ్రింద విహారి సినిమాతో మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా ఇటీవలే నాగశౌర్య అన్నయ్య పెళ్లి చేసుకోగా ఇప్పుడు నాగశౌర్య పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు.
బెంగుళూరుకు చెందిన అనూష శెట్టి అనే అమ్మాయిని నాగశౌర్య నవంబర్ 20న బెంగుళూరులో పెళ్లి చేసుకోబోతున్నాడు. దీంతో నాగశౌర్య పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు అని తెగవెతికేస్తున్నారు నెటిజన్లు. అనూష శెట్టి బెంగుళూరుకి చెందిన ఇంటీరియర్ డిజైనర్. హైదరాబాద్, బెంగుళూరులో పలు లగ్జరీ ఇళ్లకు ఇంటీరియర్ డిజైనింగ్ చేసింది. అనూష శెట్టి డిజైన్స్ అని తానే సొంతంగా ఓ కంపెనీని స్థాపించి వర్క్ చేస్తుంది. ఇప్పటికే ఈ కంపెనీ ద్వారా కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఇళ్ళకి ఇంటీరియర్ డిజైన్ చేసింది.
తన రంగంలో కష్టపడి పైకి ఎదిగి పలు అవార్డులని కూడా సాధించింది. 2019లో డిజైనర్ అఫ్ ది ఇయర్, 2020లో అండర్ 40 బెస్ట్ ఇంటీరియర్ డిజైనర్స్ లో చోటు, 2020లో మోస్ట్ ఇన్నోవేటివ్ లగ్జరీ డిజైనర్, 2021లో ఇండియా టాప్ 10 డిజైనర్స్ లో చోటు దక్కించుకుంది. ఇలా పలు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకుంది అనూష శెట్టి. పలు మ్యాగజైన్స్ లో కూడా తన గురించి స్పెషల్ ఆర్టికల్స్ ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం శౌర్య పెళ్లి మ్యాటర్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.