Siva Karthikeyan : ప్రముఖ తమిళ యంగ్ హీరో శివ కార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఆయన నటించిన రెమో, వరుణ్ డాక్టర్ సినిమాలు తెలుగులోనూ మంచి హిట్స్ గా నిలిచాయి. తాజాగా శివ కార్తికేయన్, అనుదీప్ డైరెక్షన్ లో ” ప్రిన్స్ ” అనే సినిమా చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, సురేష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇక ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ్ భాషలో విడుదల చేయబోతున్నారు.
కాగా అక్టోబర్ 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్న సందర్భంగా మూవీ టీమ్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ఇటీవలే తమిళంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసారు . కాగా తెలుగులోనూ ఈ ఈవెంట్ ను గ్రాండ్ గా జరపడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు ఈరోజు హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్స్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రముఖ హీరోలు విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా , డైరెక్టర్ హరీష్ శంకర్ గెస్ట్ లుగా రానున్నట్లు ప్రకటించారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. ఈ చిత్రంలో శివ కార్తికేయన్ సరసన మరియా ర్యాబోషప్క హీరోయిన్గా నటిస్తోంది. జాతిరత్నాలు సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన అనుదీప్ … ఈ సినిమాతో కూడా తన మార్క్ కామెడీని రిపీట్ చేస్తాడని చెబుతున్నారు. మరి ప్రిన్స్ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.