Prabhas- Anushka : ప్రభాస్, అనుష్క పెయిర్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. బిల్లా సినిమాలో ప్రభాస్, అనుష్క మొదటిసారి కలిసి నటించారు. ఆ తర్వాత మిర్చి సినిమాతో మెప్పించి క్యూట్ కపుల్ అనిపించుకున్నారు. ఇక బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలతో వీరిద్దరూ నిజంగా కపుల్ అయితే బాగుండు అని అంతా అనుకున్నారు. అంతలా వీరి పెయిర్ కి అభిమానులు ఏర్పడ్డారు. ఇక వీరిద్దరి మధ్య కూడా చాలా మంచి స్నేహం ఉంది. వీరిద్దరూ కలిసి కనపడితే అభిమానులు సంతోషిస్తారు.
ప్రభాస్, అనుష్క కలిసి మళ్ళీ సినిమాలు చేయాలని అభిమానులతో పాటు చాలా మంది ప్రేక్షకులు కోరుకుంటున్నారు. కానీ ఇప్పట్లో వీరిద్దరూ కలిసి సినిమాలు చేసేలా కనపడట్లేదు. అనుష్క ప్రస్తుతం ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ లో మాత్రం సినిమా చేస్తుంది. తాజాగా నేడు ప్రభాస్, అనుష్క సినిమాల అప్డేట్స్ ఒకే రోజు రావడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) నుంచి రాబోతున్న సినిమా ‘సలార్’. ప్రస్తుతం సలార్ షూటింగ్ చివరి దశలో ఉందని సమాచారం. సెప్టెంబర్ 28న ఈ సినిమా రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించారు చిత్రయూనిట్. అయితే సలార్ టీజర్ ని జులై 6 ఉదయం 5 గంటల 12 నిమిషాలకు విడుదల చేస్తామని ప్రకటించారు.
ఇక అనుష్క శెట్టి (Anushka Shetty) చివరగా నిశ్శబ్దం సినిమాతో 2020లో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మూడేళ్ళ తర్వాత యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty)తో కలిసి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ అనే సినిమాని యువీ క్రియేషన్స్ బ్యానర్ లో ప్రకటించారు. ఇటీవల ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా ఆగస్టు 4న థియేటర్స్ లోకి రానున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించారు.