Superstar Krishna : సూపర్ స్టార్ కృష్ణ గారి మరణవార్తను ఆయన అభిమానులే కాకుండా ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. వీరరాఘవయ్య, నాగరరత్నమ్మల నలుగురు సంతానంలో కృష్ణ పెద్దవారు. సినిమాల్లోకి అరగ్రేటం చేసిన తర్వాత దర్శకుడు ఆదుర్తి ఆయన పేరును కృష్ణగా మార్చారు. నటుడి గానే కాకుండా దర్శకుడు, నిర్మాతగా కూడా కృష్ణ రాణించారు.
1962లో మేనమామ కూతురు ఇందిరాదేవితో కృష్ణకు వివాహమైంది. ఈ దంపతులకు మహేష్ బాబు, రమేష్ బాబు అనే ఇద్దరు కుమారులు.. పద్మావతి, మంజుల, ప్రియదర్శని అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇందిరతో వివాహమైన నాలుగేళ్లకు 1969లో విజయనిర్మలతో కృష్ణకు రెండో వివాహమైంది. దాదాపు 48 సినిమాల్లో విజయనిర్మలతో కలిసి ఆయన నటించారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య ఏర్పడిన స్నేహాం పెళ్లి వరకు దారి తీసింది. విజయనిర్మల డైరెక్షన్‌లో కృష్ణ చాలా సినిమాల్లో నటించారు. సినిమాల్లోకి రాకముందు నాటకాల్లో కృష్ణ నటించారు.
1960లో చేసిన పాపం కాళీకెళ్లినా అనే నాటకంతో ఆయన గుర్తింపు పొందారు. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టిన కృష్ణ.. ఎన్టీఆర్,ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణంరాజులతో మల్టీస్టారర్ సినిమాలు కూడా చేశారు. కృష్ణ మొత్తం 16 సినిమాలకు దర్శకత్వం వహించారు. 1974లో ఉత్తమ నటుడిగా నంది పురస్కారం సొంతం చేసుకోగా… 1976లో కేంద్ర కార్మికశాఖ నటశేఖర్ అనే బిరుదుతో ఆయనను సత్కరించింది. 1997లో ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవిత సౌఫల్య పురస్కారం కృష్ణకు దక్కింది.