Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా ప్రాజెక్ట్ K. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. లోకనాయకుడు కమల్‌హాసన్, బాలీవుడ్ నటుడు అమితాబచ్చన్, దీపికా పదుకునే, దిశా పటాని లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూరైనట్లు చిత్ర నిర్మాత స్వప్నా దత్ తెలిపింది. షూటింగ్‌తో పోలిస్తే గ్రాఫిక్స్ పనులే అధిక సమయం పట్టనున్నట్లు వెల్లడించింది.
అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి వరుసగా అప్‌డేట్లు ఎప్పుడెప్పుడు వస్తాయా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో పురాణాలకి సంబంధించిన అంశం కూడా ఉంటుందట. దీనికి అనుగుణంగా ప్రభాస్ రోల్ పై ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ విష్ణు అవతారంలో కనిపించనున్నాడట. ఈ విషయం తెలిసి ప్రభాస్ అభిమానులు పుల్ ఖుషీ అవుతున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో చిత్ర బృందం స్పందిస్తే గానీ తెలియదు.
ఇదిలా ఉంటే.. ప్రభాస్ వరుస చిత్రాలతో పుల్ బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన ఆదిపురుష్ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనిపై పలు వివాదాలు చెలరేగిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలో నటిస్తున్నారు ప్రభాస్. ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, శ్రియా రెడ్డి, జగపతి బాబు, మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.