కాకతీయ రాజుల స్ఫూర్తితో తెలంగాణలో సుపరిపాలన సాగుతున్నదని ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌కు చెందిన కాకతీయుల వారసుడు కమల్‌చంద్ర భంజ్‌దేవ్ కొనియాడారు. పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించిన కాలంలో కాకతీయ పాలకులు ముందుచూపుతో గొలుసుకట్టు చెరువులను తవ్వించారని గుర్తుచేశారు. కాకతీయల స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతో చెరువులను పునరుద్ధరించిందని చెప్పారు. చారిత్రక వరంగల్ నగరం పులకించిపోయేలా గురువారం ప్రారంభమైన కాకతీయ వైభవ సప్తాహం వేడుకలకు తొలిరోజు ముఖ్యఅతిథిగా కమల్‌చంద్ర హాజరయ్యారు. పర్యాటక మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, గిరిజన సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తో కలిసి కాకతీయుల ఇలవేల్పు భద్రకాళీ అమ్మవారిని దర్శించుకొన్నారు.
వరంగల్‌లోని పోచమ్మమైదాన్ జంక్షన్‌లో రాణిరుద్రమదేవి విగ్రహానికి పూలమాల వేశారు. కాకతీయ రాజధాని కేంద్రం ఖిలా వరంగల్‌ను సందర్శించారు. స్వయంభూ శ్రీ శంభులింగేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేశారు. వెయ్యి స్తంభాల ఆలయాన్ని, అగ్గలయ్య గుట్టను సందర్శించారు.
ఈ సందర్భంగా కమల్‌చంద్ర మాట్లాడుతూ… 700 ఏండ్ల క్రితం ఇక్కడి నుంచి వెళ్లిన కాకతీయుల మూలాలు ఉన్న వరంగల్ నగరానికి రావడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని చెప్పారు. కాకతీయ వైభవ సప్తాహంతోనే ఇది జరిగిందని.. ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. బస్తర్ ప్రాంతంలోనూ ప్రతి గ్రామానికి రెండు, మూడు చెరువులను, తాగునీటి ట్యాంక్‌లను నిర్మించామని పేర్కొన్నారు. పేదలకు సేవ చేయాలనే సంకల్పంతో కాకతీయులు పాలన చేశారని, అదే స్ఫూర్తితో తెలంగాణలో పాలన సాగుతున్నదని కొనియాడారు. భద్రకాళీ అమ్మవారిని దర్ళించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. బస్తర్‌లో దంతేశ్వరి అమ్మవారిని పూజిస్తామని చెప్పారు.
ఓరుగల్లులోనే దంతేశ్వరి మూలాలు ఉన్నాయని, ఇక్కడి నుంచే దంతేశ్వరి అమ్మవారు బస్తర్ వచ్చిందని పేర్కొన్నారు. భద్రకాళీ, దంతేశ్వరి అమ్మవారి అశీస్సులు తెలంగాణ, బస్తర్ ప్రజలకు ఉండాలని ఆకాక్షించారు. వరంగల్ ప్రజల ప్రేమ, ఆప్యాయతలు చూస్తుంటే సొంతూరు బస్తర్‌లో ఉన్నట్టుగానే ఉన్నదని అన్నారు. కాకతీయ పాలకులు 700 ఏండ్ల క్రితం వరంగల్ నుంచి బస్తర్‌కు వెళ్లారని చెప్పారు. గెజిట్ నోటిఫికేషన్‌లో తన తాత పేరు మహారాజ ప్రవీర్ చంద్ర భంజ్‌దేవ్ కాకతీయ అని ఉన్నదని, ఆ పేరుతోనే పరిశోధన చేసే అవకాశం వచ్చిందని వివరించారు. ఇంటి పేరు తర్వాత కాకతీయ అని ఉండడానికి కారణాలు తెలుసుకొనే పరిశోధనలో తమ కుటుంబానికి ఇక్కడితో సంబంధాలు ఉన్నట్టు నిర్ధారణ అయ్యిందని తెలిపారు. కాకతీయులకు ఏడు అంకె ప్రత్యేకమైనదని చెప్పారు.