Jr Ntr : దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీగా నిర్మించారు. అందరి అంచనాలకు అందుకుంటూ అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 25, 2022న విడుదలై కలెక్షన్ల సునామీని సృష్టించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ భాషాల్లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్ల రూపాయల కలెక్షన్స్‌ను రాబట్టి అబ్బుర పరిచింది. కీరవాణి సంగీతం అందించగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫిని అందించారు. కాగా ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్ సినిమాని జపాన్ లో కూడా రిలీజ్ చేసి చిత్ర యూనిట్ అక్కడ కూడా భారీగా ప్రమోషన్స్ చేస్తున్న అందరికీ సంగతి తెలిసిందే.
ఈ తరుణంలోనే గత వారం రోజులుగా చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి జపాన్ లో ఆర్‌ఆర్‌ఆర్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. అక్కడి జపాన్ ఫ్యాన్స్ ని కలిసి వారితో మాట్లాడుతున్నారు. జపాన్ ప్రేక్షకులు కూడా వీరిపై అమితంగా ప్రేమని చూపిస్తున్నారు. చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి అక్కడ కూడా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ని ఇండియన్స్ డ్యాన్స్ గురించి అడగ్గా ఒక ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
”డ్యాన్స్ అనేది ఇండియా వాళ్ళ బ్లడ్ లో ఉంటుంది. అక్కడ ఎన్నో రకాల డ్యాన్సులు ఉన్నాయి. గొప్ప గొప్ప డ్యాన్సర్లు, కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. చాలా మంది చిన్నప్పట్నుంచి డ్యాన్స్ నేర్చుకుంటారు. నేను కూడా అంతే. చరణ్ వాళ్ళ నాన్న చిరంజీవి గారు మా దేశంలో గొప్ప డ్యాన్సర్. అలాగే ప్రభుదేవా అని గొప్ప కొరియోగ్రాఫర్ ఉన్నారు. అతన్ని మేము ఇండియన్ మైకేల్ జాన్సన్ అని పిలుస్తాము. అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొనే మేము డ్యాన్స్ చేస్తున్నాము” అని చెప్పారు. ఈ నేపద్యంలోనే జపాన్ లో ఎన్టీఆర్ చిరంజీవి గురించి గొప్పగా చెప్పడంతో మెగా అభిమానులంతా ఫుల్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.