తెలంగాణ ప్రభుత్వం – ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కాకతీయుల వైభవాన్ని భవిష్యత్ తరాలకు తెలియజెప్పేలా జులై 7 వ తేదీ నుండి 7 రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన కాకతీయ సప్తాహం ఉత్సవాల ఏర్పాటుకు సంబంధించిన సన్నాహక చర్యలపై రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ… కాకతీయులు తెలంగాణ ప్రాంతానికి ఎంతో సేవ చేశారన్నారు. తెలంగాణకు మాత్రమే కాకుండా యావత్ భారతదేశం గుర్తుంచుకోదగిన గొప్ప పాలన అని అందించారన్నారు. కాకతీయుల స్ఫూర్తితోనే గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు కాకతీయ మిషన్ పేరుతో చెరువుల పూడిక తీత కార్యక్రమాల ద్వారా ఎంతో గొప్ప సేవ చేశారన్నారు. బంగారు తెలంగాణ రూపకల్పన ను కాకతీయుల నుండి స్ఫూర్తి పొందారన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు. ఈ ఉత్సవాలకు కాకతీయుల వారసుడు శ్రీ కమల్ చంద్ర బాంజ్ దేవ్ ను ఆహ్వానించాలని సీఎం కేసీఆర్ గారు చేసిన ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఆహ్వానం అందించామన్నారు.
కాకతీయుల వారసుడు ఏడు వందల సంవత్సరాల తర్వాత కమల్ చంద్ర బాంజ్ దేవ్ కాకతీయ తన సొంత పురిటిగడ్డకి రావడం సంతోషమని వారు వస్తున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు ను చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ కాకతీయ సప్తాహం ఏడురోజులపాటు బ్రహ్మాండంగా వివిధ రకాల సాంస్కృతిక, సాహిత్య, కళా కార్యక్రమాలని రూపొందించాలని మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులను ఆదేశించారు. 7 రోజుల పాటు రోజువారీ కార్యక్రమాలు ఉన్నతంగా జరగాలని, కాకతీయ వైభవాన్ని చాటి చెప్పేలా నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో దాస్యం వినయ్ భాస్కర్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, పర్యటకాభివృద్ధి సంస్థ MD మనోహర్, అరవింద్ ఆర్యా లు పాల్గొన్నారు.