TDP: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యుత్ షాక్ తో 6 మంది మహిళల ప్రాణాలు పోయాయని, దీనికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం దర్గాహోన్నూరులో విద్యుత్ షాక్ తో 6 మంది మహిళా వ్యవసాయ కూలీల మృతి బాధాకరమని కాల్వ శ్రీనివాసులు అన్నారు. వారి కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. మృతి చెందిన వారంతా బీసీ కులానికి చెందినవారని పేర్కొన్నారు. పొట్ట కూటి కోసం వెళ్లి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరగడానకి అక్కడ ఉన్నవి పాత వైర్లు కావటంతోనే అవి ట్రాక్టర్ పై తెగిపడి ప్రమాదం జరిగిందని స్ధానికులు చెబుతున్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. దీనికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని అన్నారు. అంతేగాకుండా మృతుల ఒక్కో కుటుంబానికి సుమారు రూ. 25 లక్షల వరకు ఎక్స్ గ్రేషియా ఇవ్వటంతో పాటు గాయపడిన వారికి రూ. 2 లక్షలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
విశాఖ ఎల్జీపాలిమర్స్ ప్రమాదం ఘటనలో చనిపోయిన వారికి ఒక్కొక్కరికి రూ. కోటి ఇచ్చిన ప్రభుత్వం విద్యుత్ షాక్ తో చనిపోయిన బీసీ మహిళలకు రూ. 25 లక్షలివ్వలేదా? అని ప్రశ్నించారు. వరుస విద్యుత్ ప్రమాదాల తో ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎందుకు స్పందించటం లేదని ఉద్ఘాటించారు. ఇకనైనా ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని కోరారు.