సామాన్య ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పలు పథకాలు ఇప్పటికే దేశవ్యాపితం అయ్యాయి. రైతుబంధు ప్రేరణతో ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’, మిషన్ భగీరథను అనుకరిస్తూ ‘హర్ ఘర్ జల్ యోజన’ అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ఈ జాబితాలో ‘కల్యాణలక్ష్మి’ కూడా వచ్చి చేరింది. పేదింటి ఆడబిడ్డల పెండ్లి కోసం తల్లిదండ్రులు అప్పులపాలు కాకుండా మేనమామ బాధ్యతలు స్వీకరించిన సీఎం కేసీఆర్.. ‘కల్యాణలక్ష్మి’ పేరిట ఓ బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టారు.
ఇందులో భాగంగా ఆడబిడ్డకు పెండ్లి చేసే కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ప్రభుత్వం తరఫున లక్షా నూట పదహారు రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నారు. తెలంగాణ ‘కల్యాణలక్ష్మి’ పథకం ప్రేరణతో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గురువారం ఆడబిడ్డల పెండ్లిళ్ల పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా బిడ్డ పెండ్లి చేసే వధువు కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటుగా 8 గ్రాముల బంగారు కాసు అందజేస్తారు. 94,700 మంది అమ్మాయిల వివాహానికి రూ.762 కోట్లు కేటాయించారు.అలాగే రిటైర్డు పురోహితుల పింఛను పథకాన్ని కూడా ఆయన ప్రారంభించారు. గతంలో రూ. 3 వేలున్న పురోహితుల పింఛన్‌ను రూ.4 వేలకు పెంచారు. దీంతో రాష్ట్రంలోని 1,804 మంది పురోహితులు లబ్ధి పొందనున్నారు.