‘నూటికో కోటికో పుడతారు ఒక్కరు…’ అన్నరు ఒ సినీకవి. ఆ మాట అక్షరాలా నిజం. ఎందుకంటే, సాధారణంగా ఎవరైనా తమ కోసం, తమ కుటుంబం కోసం బతుకుతారు. కానీ, ఇతరుల కోసం ఆలోచించేవారూ, ఇతరులకు సాయం చేసేందుకు పాటుపడేవారూ బహు అరుదుగా వుంటారు. అలాంటివారు జనంచేత నీరాజనాలందుకుంటారు. అలాంటివారిలో ఒకరు కన్నడ కథానాయకుడు పునీత్ రాజ్ కుమార్.
ఎంతోమంది మనసుల్ని గెలిచిన కన్నడ కథానాయకుడు పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది, అందరి మనసుల్నీ కలచి వేసింది. నటుడిగానే గాక మానవత్వంతో ఆయన అందరి మనసుల్నీ ఆకట్టుకోవడమే అందుకు కారణం. పునీత్‌కు కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ‘కన్నడ రత్న’ పురస్కారాన్ని ప్రకటించి ఆయన భార్యకు అందజేసింది. తాజాగా, కర్ణాటకలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అభివృద్ధి చేసిన ‘కేజీఎఫ్ 3 శాట్’కు పునీత్ పేరు పెట్టారు.
ఈ ఉపగ్రహాన్ని ఈ నెల చివర్లో తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్ఎల్‌వీ-సి 54 రాకెట్ ద్వారా నింగిలోకి పంపి కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ పాఠశాలలు, కళాశాల విద్యార్థులు రూపొందించిన 75 ఉపగ్రహాలను నింగిలోకి పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అంతటి మహా మనీషి మన మధ్య లేకపోయినా ఆయన పంచిన మంచితనం ఎప్పుడూ మనతోనే వుంటుంది.