‘కాంతార’ సృష్టించిన ప్రభంజనం అంతా యింతా కాదు. ఏ నోట విన్నా ఈ సినిమా మాటే…! ఒక్కొక్కరూ ఒకటికి నాలుగుసార్లు ఈ సినిమాని చూశారు, చూస్తున్నారు. అయితే, సినీ అభిమానులు భాషా బేదాన్ని చూడరని ‘కాంతార’ మరోసారి నిరూపించింది. అందువల్లే, తెలుగునాట, అటు బాలీవుడ్ లో సైతం విజయ బావుటాను ఎగురవేసింది. సెప్టెంబర్ 30వ తేదీన విడుద్లైన ‘కాంతార’ ఎర్రో రికార్డులను సాధిస్తూ మరింత మున్ముందుకు సాగుతోంది. హీరోగా, దర్శకుడిగా రిషబ్ శెట్టికి పేరుంది గానీ, ఈ సినిమాపై ఈ స్థాయి అంచనాలు విడుదలకు ముందు లేవు. తీరా రిలీజయ్యే ముందు మాత్రమే బజ్ పెరుగుతూ వెళ్లింది. తొలి ఆటతోనే హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా, ఇక ఆ తరువాత బ్లాక్ బస్టర్ హిట్ వైపు పరుగులు తీయడం మొదలైంది.
ఈ క్రమంలోనే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో థియేటర్లు దద్ధరిల్లిపోయేలా చేసింది. కన్నడ రిలీజ్ తరువాత దాదాపు 15 రోజులకు ఇతర భాషల్లో విడుదలైన ఈ సినిమా, అక్కడ కూడా తన సత్తాను చాటుకుంది. కేవలం 16 కోట్లతో నిర్మించిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా చాలా వేగంగా 200 కోట్లను కొల్లగొట్టిన సినిమాగా నిలిచింది. అలాంటి ఈ సినిమా తాజాగా మరో రికార్టును సొంతం చేసుకుంది. ఒక్క కర్ణాటకలోనే కోటికి పైగా టిక్కెట్లు అమ్ముడైనట్టుగా చెబుతూ, మేకర్స్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఇది కర్ణాటక ప్రాంతంలో ఒక గిరిజన గూడెం నేపథ్యంలో నడిచిన కథ. అక్కడి ఆచార వ్యవహారాలనూ, విశ్వాసాలనూ కలుపుకుంటూ ఈ కథ నడుస్తుంది. అన్ని పాత్రలు అడవిలోకి వస్తాయి తప్ప, అడవిని దాటి ఏ పాత్ర బయటికి వెళ్లదు. అడవి సాక్షిగానే కథ నడుస్తూంటుంది. తక్కువ బడ్జెట్ లో నిర్మితమై ఈ స్థాయి లాభాలను అందుకున్న సినిమా, ఈ మధ్య కాలంలో ఇదేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘కాంతార’ చిత్రం యూనిట్ కు మన తరపున కూడా కోటి అభినందనలు తెలుపుదామా ?