యాక్షన్ హీరో విశాల్ కథానాయకుడిగా ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో రానా ప్రొడక్షన్స్‌పై రాబోతోన్న హై ఆక్టేవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘లాఠీ’. రమణ, నంద సంయుక్త నిర్మాణంలో భారీగా తెరకెక్కిస్తున్నారు. విశాల్ సరసన సునయన హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో డిసెంబర్ 22న విడుదల కానున్న ఈ పాన్ ఇండియా మూవీ టీజర్, ఫస్ట్ సింగిల్, గ్లింప్స్ లాంచింగ్ ఈవెంట్ హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో గ్రాండ్ గా జరిగింది. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ముఖ్య అతిధిగా పాల్గొని టీజర్ ని లాంచ్ చేశారు. హీరో కార్తికేయ, శివబాలాజీ, మధుమిత, అభినయ తదితరులు ఈవెంట్ లో పాల్గొన్నారు. విశాల్ ఈవెంట్ లో పోలీస్ డ్రెస్ వేసుకొని బైక్ పై వేదిక వద్దకు రావడం ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఈ ఈవెంట్ లో పలువురు పోలీసు అధికారులు కూడా హాజరయ్యారు.
రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. విశాల్ గారి గురించి అందరూ గొప్పగా చెప్పారు. నేను ఒక చెడ్డ మాట చెబుతాను(నవ్వుతూ). విశాల్ గారికి ఒక జబ్బు అంటుకుంది. సినిమా కథ ఎంత బడ్జెట్ అయినా ఎన్ని రోజులైనా షూటింగ్ చేయాలనే జబ్బు. ఈ జబ్బు మా అబ్బాయి రాజమౌళి దగ్గర నుండి అంటుకుంది(నవ్వుతూ) మా అబ్బాయి ఎలా అయితే సక్సెస్ అందుకున్నాడో మంచి మనసున్న విశాల్ కూడా విజయాన్ని అందుకుంటారని కోరుకుంటున్నాను. కార్తికేయ 2 ఈవెంట్ కి వెళ్లాను. అక్కడ పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. పెద్ద హిట్ అవుతుందని కోరుకున్నాను. దేవుని దయవల్ల పెద్ద విజయం సాధించింది. ‘లాఠీ’ కూడా అద్భుతమైన విజయం అందుకుంటుంది. అందరికీ ఆల్ ది బెస్ట్. ‘అందరూ సినిమా చూసి పెద్ద హిట్ చేయండి” అని కోరుకున్నారు.