Loan Apps : ఆన్ లైన్ లోన్ యాప్ ల వేధింపులు కారణంగా పలువురు మృత్యువాత పడుతున్న విషయాన్ని చూస్తూనే ఉంటున్నాం. అయినా కానీ ఈ లోన్ యాప్ ల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఇప్పుడు తాజాగా మరో ఘటన చూస్తుంటే ఇంత హీనానికి దిగజారుతున్నారని ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఓ వ్యక్తి ఈ లోన్ యాప్ ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ఇంతకాలం మౌనంగా ఉన్న యాప్ నిర్వాహకులు మళ్లీ అతడి భార్యను వేధించడం మొదలు పెట్టారు. భర్తను కోల్పోయి, నెలల చిన్నారితో పుట్టింటికి చేరిన ఆ మహిళను ఫోన్ చేసి డబ్బులు కట్టాలంటూ వేధిస్తున్నారు. దీంతో ఆ మహిళ తన భర్త మరణానికి కారణమైన యాప్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
హైదరాబాదులకు చెందిన పండిటి సునీల్ సాఫ్ట్ వేర్ డెవలపర్ గా పని చేస్తున్నాడు. కరోనా లాక్ డౌన్ కాలంలో జాబ్ పోవడంతో ఆర్థిక సమస్యలు తలెత్తాయి. అదే సమయంలో భార్య పండిటి రమ్యశ్రీ గర్భంతో ఉండడంతో అప్పు కోసం లోన్ యాప్ ను ఆశ్రయించాడు. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పలేదు. అప్పు తీసుకున్న వారం రోజుల నుంచే సునీల్ కు ఫోన్లు, మెసేజ్ లు రావడం మొదలైందని సునీల్ భార్య రమ్యశ్రీ చెబుతోంది. ఓ రోజు తనతో పాటు కుటుంబ సభ్యులు బంధువుల ఫోన్లకు కూడా మెసేజ్ లు వచ్చాయని ఆమె వివరించారు. సునీల్ తమకు బాకీ ఉన్నాడని, ఆ మొత్తం చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నాడని ఆ మెసేజ్ లో ఉందన్నారు. ఈ గొడవ కొనసాగుతుండగానే తమకు బాబు పుట్టాడని రమ్యశ్రీ వివరించారు.
లోన్ యాప్ వేధింపులతో 2020 డిసెంబర్ లో తన భర్త సునీల్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వాపోయింది. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు రమ్య వివరించారు. భర్త మరణంతో పుట్టింటికి చేరిన రమ్యశ్రీకి లోన్ యాప్ నిర్వాహకుల నుంచి ఫోన్లు రావడం మొదలైంది. సునీల్ అప్పు తీసుకున్న మొత్తం వడ్డీతో సహా చెల్లించాలని ఫోన్లలో బెదిరిస్తున్నారని రమ్యశ్రీ వివరించారు. ఏడాదిగా ఈ వేధింపులు ఆగడంలేదని ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు.