ఒకరు కాదు, ఇద్దరు కాదు పదిమంది పిల్లల్ని కంటే బహుమతులా? మతి వుందా? అంటారా? నిజమేనండీ బాబూ… కాకపోతే, ఇది మనదేశంలో కాదు. రష్యాలో. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ విధంగా ప్రకటించారు. ఎందుకలా? అంటారా… దానికో బలమైన కారణం వుంది. కరోనా మహమ్మారి, ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రభావం ఆ దేశ జనాభా ఉత్పత్తిపై పడింది. దీంతో రష్యా దేశ జనాభాను గణనీయంగా పెంచాలని పుతిన్ కంకణం కట్టుకున్నారు.
అయితే, ఆయన చెప్పిందేంటంటే పది మంది పిల్లలను కనే మహిళకు ఒక మిలియన్ రూబుల్స్ అంటే 13,500 పౌండ్లను బహుమతిగా అందిస్తారు. కాకపోతే, అప్పటికి మిగిలిన తొమ్మిది మంది పిల్లలు కూడా జీవించి ఉండాలి. పదో సంతానం మొదటి పుట్టిన రోజున ఈ మొత్తాన్ని ఇస్తారు. అయితే, సాధారణంగా కారణాలేవేమైనప్పటికీ ప్రభుత్వం ఏవైనా ప్రకటనలు చేసిన నేపథ్యంలో వాటిని అనేక కోణాల్లో ఆలోచించి కొందరు ఖచ్చితంగా విమర్శిస్తారు. అదే క్రమంలో పుతిన్ ప్రకటించిన ఈ తాయిలాలను నిపుణులు విమర్శిస్తున్నారు. ఎక్కువ మందిని కనేవారినే దేశభక్తులుగా పేర్కొంటున్నట్టుగా పుతిన్ ప్రకటన వుందని వారంటున్నారు.
ఇక్కడ మనం గమనించాల్సిన మరో విషయమేంటంటే విస్తీర్ణం పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైన రష్యా జనాభా కేవలం 14 కోట్లు మాత్రమే. ఇంతకీ, పుతిన్ ప్రకటించిన తాయిలాలను అక్కడి ప్రజలు స్వాగతిస్తారా, లేక వ్యతిరేకిస్తారా అనే విషయం కోసం వేచి చూడాల్సిందే…!!