Balakrishna : టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ‘దాస్ కా ధమ్కీ’ మూవీ ట్రైలర్ అద్భుతంగా ఉందని నటసింహం నందమూరి బాలకృష్ణ అన్నారు. కాగా తాజాగా గచ్చిబౌలిలోని ఏఎంబీ సినిమాస్‌లో జరిగిన ‘దాస్ కా ధమ్కీ’ టీజర్ లాంచ్ ఈవెంట్ లో బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటీవలే ఓరి దేవుడా సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈ యంగ్ హీరో… మరోసారి హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. పైగా ఈ సినిమాకి దర్శకత్వం, నిర్మాత కూడా విశ్వక్ సేనే కావడం విశేషం అని చెప్పాలి.
కాగా ఈ ఈవెంట్ లో పాల్గొన్న బాలయ్య తెలంగాణ యాసలో మాట్లాడి అందర్నీ ఆశ్చర్య పరిచారు. గుక్క తిప్పుకోకుండా సరస్వతీ నమస్తుభ్యం స్తోత్రాన్ని చెప్పి అందర్నీ మెప్పించారు. అలానే ఈ ట్రైలర్ గురించి బాలకృష్ణ మాట్లాడుతూ… నీ ఇంట్లో నా ఇంజిను అంటూ విశ్వక్ చెప్పిన డైలాగ్ చెప్పి రచ్చ చేశారు. దాస్ కా ధమ్కీ ట్రైలర్ చాలా అద్భుతంగా కన్నుల విందుగా వుంది. విశ్వక్ సేన్ కి నా అభినందనలు. డీవోపీ వండర్ ఫుల్ గా వర్క్ చేశారు. యష్ మాస్టర్ అద్భుతమైన స్టెప్స్ వేయించారు. మంచి సాహిత్యం కూడా వుంది. సినిమా అంటే విశ్వక్ కి చాలా ప్యాషన్. ఈ సినిమా చూస్తే విశ్వక్ ప్యాషన్ ఏంటో తెలుస్తుంది. ఎన్నో ఒడిదుడుగులు దాటి ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాని కొత్తదనంని ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ సినిమాకి నటనతో పాటు దర్శకత్వం నిర్మాణం చేయడం కూడా చాలా అరుదైన విషయం. అన్నీ తానై, తన టీంకి స్ఫూర్తిని ఇచ్చారు విశ్వక్ సేన్. ఇలాంటి సినిమాలు చూస్తున్నపుడు నన్ను నేను ఊహించుకుంటాను అని అన్నారు.
అలానే నేను ఒక సినిమా డైరెక్ట్ చేద్దామనుకున్నాను. కానీ, నా వల్ల కాలేదు. మధ్యలో ఆ సినిమా ఆగిపోయింది. అది ‘నర్తనశాల’. ఆ తర్వాత మళ్ళీ దాని జోలికి వెళ్ళలేదు. నాకు టైమ్ లేదు. కొన్ని సబ్జెక్టులు తట్టలేదు” అని బాలకృష్ణ అన్నారు. అప్పుడు మళ్ళీ మీ దర్శకత్వంలో సినిమా లేదా? అంటూ వేదిక కింద ఉన్న అభిమానులు అడిగితే… ”ఉంది ఉంది తప్పకుండా! ‘ఆదిత్య 999’ ఉంది” అని బాలకృష్ణ చెప్పారు. దాంతో ఆయన దర్శకత్వంలో ఆ సినిమా రూపొందనుందని క్లారిటీ వచ్చింది.