Nani : సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించి న్యాచురల్ స్టార్ గా ఎదిగాడు ” నాని “. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చి హిట్లు, ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ఈ హీరో. ఓ వైపు హీరోగా రాణిస్తూనే మరోవైపు నిర్మాత గాను మంచి చిత్రాలు తీస్తూ మెప్పిస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా అంటూ నిర్మాణ సంస్థని స్థాపించి పలు సినిమాలని కూడా తెరకెక్కిస్తున్నాడు నాని. కాగా నాని సోదరిగా దీప్తి అందరికి పరిచయమే. గతంలోనే ఓ షార్ట్ ఫిలింతో అందర్నీ మెప్పించింది దీప్తి. వాల్ పోస్టర్ సినిమా నిర్మాణ సంస్థలో కూడా పలు బాధ్యతలు చూసుకుంటుంది దీప్తి. అయితే ఇప్పుడు తాజాగా ఈమె దర్శకురాలిగా మారింది.
తనే కథ రాసి దర్శకత్వం కూడా వహించింది. ‘మీట్ క్యూట్’ అనే పేరుతో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులను అలరించనుంది. అయిదు డిఫరెంట్ కథలు ఉండే ఆంథాలజీగా ఈ సినిమాని నాని నిర్మాణ సంస్థ అయిన వాల్ పోస్టర్ సినిమా లోనే నిర్మించారు. ఇందులో సత్యరాజ్, వర్ష బొల్లమ్మ, ఆదా శర్మ, రుహానీ శర్మ, శివ కందుకూరి… పలువురు ప్రముఖులు నటించారు.
ఈ సినిమా సోని లివ్ ఓటీటీలో త్వరలో రానుంది. ఈ మేరకు దీప్తి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసింది. ఆమె చేసిన పోస్ట్ ను నాని షేర్ చేస్తూ… ”ఇన్నాళ్లు నేను ఒక్కడినే తెలివైనవాడిని అనుకునేవాడిని. కానీ తెలివైన ఒక అక్కకి తమ్ముడ్ని అని ఇప్పుడే తెలిసింది. ఇలా ఒక గొప్ప సినిమాని నువ్వు డైరెక్ట్ చేసినందుకు నేను చాలా గర్విస్తున్నాను” అంటూ చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. కాగా నేడు ఈ సినిమా టీజర్ రిలీజ్ కానుంది.