కాంట్రాక్ట్ రీసెర్చ్, డెవలప్‌మెంట్, మాన్యుఫాక్చరింగ్ (సీడీఎంవో) కంపెనీ ఆరిజిన్ ఫార్మాస్యూటికల్ సర్వీసెస్ హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో ఒక అత్యాధునిక ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నది. ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌కు స్టెప్-డౌన్ సబ్సిడరీ అయిన ఆరిజిన్ రూ.320 కోట్ల పెట్టుబడితో నెలకొల్పనున్న ఈ ప్లాంట్ వివరాల్ని, వృద్ధి ప్రణాళికల్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ను మంగళవారం డాక్టర్ రెడ్డీస్ చైర్మన్ సతీశ్‌రెడ్డి, అరిజీన్ సీఈవో అఖిల్ రవిలు కలిసి వివరించారు.
ఈ ప్లాంట్‌లో వచ్చే మూడేండ్లలో చేయనున్న పెట్టుబడులతో 250 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. థెరపిటెక్ ప్రొటీన్స్ తదితర ప్రత్యేక ఉత్పత్తుల అభివృద్ధి, తయారీపై ఈ ప్లాంట్ దృష్టిపెడుతుంది.
ఈ సందర్భంగా కంపెనీ సీఈవో అఖిల్ రవి మాట్లాడుతూ… కీలకమైన మౌలిక వసతుల్ని, మద్దతును అందిస్తూ తెలంగాణ, హైదరాబాద్‌ను ప్రధాన ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ హబ్‌గా అభివృద్ధిపరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా బయోటెక్ కంపెనీలకు అత్యున్నత సేవల్ని అందించడానికి హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీకి విస్తరిస్తున్నామని చెప్పారు.
‘బయోలాజిక్స్ రీసెర్చ్, డెవలప్‌మెంట్‌కు హైదరాబాద్ అద్భుతమైన ఎకోసిస్టమ్‌ను అందిస్తున్నది. బయో ఫార్మాస్యూటికల్ పరిశోధన, ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా హైదరాబాద్ హోదాను ఆరిజిన్ తాజా పెట్టుబడి మరింత పెంచుతుందని తెలియపర్చడానికి నేను సంతోషిస్తున్నా. ఆరిజిన్ పెట్టుబడి హైదరాబాద్‌లో సీడీఎంవో ఎకోసిస్టమ్ వృద్ధికి దోహదపడటమే కాకుండా తెలంగాణను బయోలాజిక్స్ ఉత్పాదక వేదికగా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వం దార్శినికతను బలోపేతం చేస్తున్నది’
– కేటీఆర్ ట్వీట్