PM Narendra Modi : గుజరాత్ లో బ్రిడ్జి కూలిన ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ… ఈ ఘటన చాలా విచారకమైనదని … మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై గుజరాత్ ప్రభుత్వం సహాయక చర్యల్ని కొనసాగిస్తోందని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు అన్ని విధాల సహాయం చేస్తుందని మోదీ హామీ ఇచ్చారు.
కాగా మోర్బీ పట్టణంలోని మచ్చు నదిపై ఉన్న బ్రిడ్జి కూలిన విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో సుమారు 500 మంది బ్రిడ్జిపై ఉన్నట్లు సమాచారం. పలువురు ప్రాణాలతో బయటపడగా సోమవారం తెల్లవారుజాము వరకు ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం 137 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో చాలా మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఎన్‌డిఆర్‌ఎఫ్‌కు చెందిన ఐదు బృందాలు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
అదే విధంగా సర్దార్ పటేల్ 147వ జయంతి సందర్భంగా… గుజరాత్‌లోని కెవాడియాకు చేరుకున్నారు. ఏక్తా దివస్ పరేడ్‌లో పాల్గొనడం ద్వారా జాతీయ ఐక్యత ప్రమాణం చేశారు. ఇక్కడ ప్రధాని మాట్లాడుతూ… దుఃఖ సమయాల్లో దేశం ఐక్యంగా కనిపిస్తుందన్నారు. ప్రస్తుతం కేవడియాలో ఉన్నా నా ఆలోచనంతా మోర్బీ బాధితుల గురించే. ఒకవైపు గుండె అంతా విషాదం నిండి ఉన్నా… తప్పక నిర్వహించాల్సిన విధులు ముందున్నాయని చెప్పారు. అనంతరం ‘ఆరబ్ 2022’లో జాతీయ ఐక్యత , సమగ్రతను కాపాడుతామని ట్రైనీ పోలీసు అధికారులతో ప్రధాని మోదీ ప్రమాణం చేయించారు.