Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినీ పరిశ్రమలో అడుగుపెట్టి నేతితో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. రెబల్ స్టార్ కృష్ణంరాజుకు మగసంతానం లేరు. దాంతో తమ్ముడు యు.వి.సూర్యనారాయణ రాజు చిన్న కొడుకైన ప్రభాస్‌నే తన వారసుడిగా ప్రకటించారు. ప్రభాస్ తొలి చిత్రం ‘ఈశ్వర్’ నవంబర్ 11తో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంటోంది. 2002 నవంబర్ 11న విడుదలైన ‘ఈశ్వర్’ చిత్రం ప్రభాస్ ను అభిమానుల మదిలో ‘యంగ్ రెబల్ స్టార్’గా నిలిపింది. ఆ తర్వాత రాఘవేంద్ర వర్షం సినిమాతో కెరీర్ లో మొదటి కమర్షియల్ హిట్ అందుకున్న ప్రభాస్, ఛత్రపతి సినిమాతో మాస్ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. చక్రం లాంటి మూవీలో నటించి, నటుడి గాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బిల్లా, మున్నా వంటి స్టైలిష్ చిత్రాలు ప్రభాస్ ని యూత్ కి మరింత దగ్గర చేశాయి.
‘బుజ్జిగాడు’లా నవ్విస్తూ, ‘డార్లింగ్’లా ప్రేమిస్తూ, ఫ్యామిలీ ఆడియన్స్ చేత కూడా ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ అనిపించుకున్నాడు. ఇక మిర్చిలో తన నట విశ్వరూపం చూపించి తన కెరీర్ లోనే ఆ సినిమాను మైల్ స్టోన్ గా మార్చుకున్నాడు. ఆ తరువాత రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ ప్రభాస్ ని ఇండియన్ సూపర్ స్టార్ గా మార్చేసింది. దేశంలోని ప్రతి టాప్ టెక్నీషియన్ ప్రభాస్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారంటే.. మన రెబల్ స్టార్ ఎంతటి శిఖరానికి చేరుకున్నాడో అర్ధమవుతుంది.
అయితే ప్రభాస్ మునపటి చిత్రాలు సాహో, రాధే శ్యామ్ బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న విజయాన్ని అందుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ రాబోయే చిత్రం ‘ఆదిపురుష్’పైనే ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాకు కొన్ని మార్పులు చేస్తూ, చిత్రాన్ని 2023 జూన్ 16న విడుదల చేస్తామని దర్శకనిర్మాతలు తెలిపారు. ఓమ్ రౌత్ దర్శకత్వంలో ఈ ‘ఆదిపురుష్’ రూపొందుతోంది. ‘కేజీఎఫ్’ సిరీస్‌తో సంచలన విజయం సాధించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘సలార్’ రాబోయే ఏడాది సెప్టెంబర్ 28న విడుదల కానుంది. ఈ చిత్రాల తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కె’లోనూ ప్రభాస్ నటిస్తున్నారు. ఈ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా మూవీస్ గానే ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. మరి ఈ మూడు సినిమాలతో ప్రభాస్ ఏ స్థాయిలో జనాన్ని ఆకట్టుకుంటారో చూడాలి. ఇక ప్రభాస్ సినీ పరిశ్రమలో 20 ఏళ్ళు పూర్తీ చేసుకున్న సందర్భంగా… ప్రభాస్ సూపర్ హిట్ మూవీ ‘వర్షం’ ని ఈరోజు రీ రిలీజ్ చేశారు. దీంతో థియేటర్ల వద్ద రెబల్ అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు.