AP nominated posts: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో నామినేటెడ్ పోస్టును భర్తీ చేసింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పోస్టుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ను నియమిస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ పదవికి కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఇదిలా ఉంటే ఈ పోస్ట్ లో కొమ్మినేని సుమారు రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.
కృష్ణా జిల్లా లోని గన్నవరంలో కొమ్మినేని శ్రీనివాసరావు పుట్టి పెరిగారు. 1978 లో ఆయన జర్నలిజం లో ఒనమాలు దిద్దారు. సుదీర్ఘ అనుభవం ఉన్న కొమ్మినేని వివిధ పత్రికల్లో చిన్ని స్థాయి నుంచి అత్యున్నత స్థాయిల వరకు పని చేసుకుంటూ వచ్చారు. ఈ యన తన పత్రికా ప్రస్థానాన్ని 1978 లో ఈనాడు తో ప్రారంభించారు. విజయవాడ, తిరుపతి, హైదరాబాద్, న్యూఢిల్లీ లో రిపోర్టింగ్ లో తన శైలిలో ముందుకు వెళ్లారు. ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్‌గా కూడా కొంత కాలం సేవలు అందించారు. 2007 జనవరి నుంచి ఎన్ టీవీలో లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం కేఎస్ఆర్ లైవ్ షో పేరుతో సాక్షి టీవీలో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటు ప్రముఖ సినిమా యాక్టర్ పోసాని కృష్ణ మురళికి కూడా మరో నామినేటెట్ పోస్టు ను అప్పగించింది. ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పోసాని కృష్ణమురళీని నియమిస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.