Rachakonda News : మాడ్గుల పోలీసు స్టేషన్ పరిధిలో ఈ నెల ఐదవ తేదీన రాత్రి సమయంలో కుటుంబ సభ్యుల తోడు లేకుండా అత్యవసర పరిస్థితిలో ఉన్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక గుర్తు తెలియని నిండు గర్భిణీ మహిళ గురించి డయల్ 100 కాల్ ద్వారా సమాచారం అందుకున్న గస్తీ పోలీసులు వెంటనే ఆమె వద్దకు చేరుకొని అత్యవసర పరిస్థితుల్లో వారే ఆమెకు రక్షణగా ఉండి స్ధానిక మహిళల సహాయంతో పురుడుపోసి తమ గొప్ప మనసు చాటుకున్నారు.
సమాచారం అందుకున్న తక్షణమే స్పందించి వ్యక్తి ప్రాణం కాపాడిన అధికారులు ఇన్‌స్పెక్టర్ పల్సా నాగరాజు గౌడ్ మరియు సత్వరమే స్పందించి ఆపదలో ఉన్న నిండు గర్భిణికి ఆపన్నహస్తం అందించిన పెట్రో కార్ సిబ్బంది రాజేందర్ PC-3521, సురేశ్ HG-1906 మరియు గర్భిణి మహిళకు పురుడు పోసిన స్థానిక మహిళలైన దుబ్బాక జంగమ్మ, వరికుప్పల భారతమ్మలను కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపిఎస్ గారు అభినందించి ఈ రోజు రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో సత్కరించారు.
ఈ ఘటనలో స్థానిక మహిళలు దుబ్బాక జంగమ్మ, వరికుప్పల భారతమ్మలు పోలిసుల అభ్యర్ధన మేరకు సాదరంగా ముందుకు వచ్చి సదరు గర్భిణి మహిళకు పురుడు పోయడం జరిగింది. ఆపదలో ఉన్న మహిళకు పురుడు పోయడం ద్వారా వారు తమ మానవత్వాన్ని చాటుకున్నారని, ఎంతో మందికి ప్రేరణ కల్పించారని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపిఎస్ ప్రత్యేకంగా అభినందించారు. ఇటువంటి మానవతావాద చర్యలతో ప్రజలకు పోలీసుల మీద నమ్మకం మరింతగా పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎసిపి ఐటి సెల్ నరేందర్ గౌడ్ మరియు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.