Rashmika – Nithin Movie : ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన కన్నడ అందం రష్మిక మందన్న(Rashmika Mandanna). ఆ తరువాత ‘గీత గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెదరని ముద్ర వేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ చిత్రంతో నేషనల్ క్రష్‌గా మారింది. దీంతో అమ్మడికి అవకాశాలు క్యూ కట్టాయి. వరుస సినిమాలతో బిజీగా ఉంది.
ఆ మధ్య నితిన్ (Nithin) హీరోగా వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వంలో ఓ సినిమాను అనౌన్స్ చేశారు. ఇందులో రష్మిక మందన్న నటిస్తుందని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా పూజా కార్యక్రమం ఈ ఏడాది మార్చిలో జరిగింది. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి రష్మిక తప్పుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
మరో రెండు సినిమాలకు సైతం సైన్ చేసింది. ఈ నేపథ్యంలో నితిన్-వెంకీ సినిమాకు డేట్లను కేటాయించడం రష్మిక కు కుదరడం లేదు. దీంతో చిత్ర బృందంతో చర్చించిన తరువాత ఈ సినిమా నుంచి రష్మిక తప్పుకున్నట్లు వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోండగా చిత్రబృందం మరో హీరోయిన్ వేటలో పడినట్లు తెలుస్తోంది. రష్మిక తప్పుకోవడంతో శ్రీలీల చిత్రానికి సైన్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో 2020లో ‘భీష్మ’ చిత్రం వచ్చింది. ఈ సినిమాలో రష్మిక కథానాయికగా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. మరోసారి ఈ ముగ్గురి కాంబినేషన్‌లో మరో సినిమా వస్తుందని ప్రకటించడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు రష్మిక తప్పుకుందనే వార్తలు వినిపిస్తుండగా.. చిత్ర బృందం ఇంకా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.