Accident : కోనసీమ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. కొద్ది రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నామనే ఆనందాన్ని ఆ తల్లికి దూరం చేసింది. తన బిడ్డిని చేతుల్లోకి తీసుకోవాలనే ఆ తండ్రి కోరిక తీరకుండానే అనంత లోకాలకు చేరాడు. ఆ కుటుంబంలో మరొకరు చేరుతారన్న ఆనందం నిలవకుండానే రోడ్డు ప్రమాదం అతనిని పొట్టన పెట్టుకోవడంతో వారి కుంటుంబంలో ఒక్కసారిగా దుఖాఛాయలు అలుముకున్నాయి.
ఆలమూరు మండల పరిధిలోని చొప్పెల్ల లాకుల సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. కాగా ఈ ప్రమాదంలో అంబాజీపేట మండలం చిరుతపూడి గ్రామానికి చెందిన యలమంచిలి నాగరాజు (45) మృతి చెందినట్లు ఎస్సై ఎస్.శివప్రసాద్ తెలిపారు. రాజమహేంద్రవరం వైపు నుంచి రావులపాలెం వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న నాగరాజును చొప్పెల్ల లాకుల సమీపంలో రావులపాలెం నుంచి రాజమహేంద్రవరం వైపు వస్తున్న ఐసర్ వ్యాన్ ఢీ కొట్టింది. దీంతో ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఉపాధి కోసం కువైట్ వెళ్లి తిరిగి వచ్చి రాజమహేంద్రవరంలోని హోటల్‌లో కుక్‌గా పనిచేస్తున్న నాగరాజు తన తల్లిని చూసేందుకు సొంత ఊరికి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
సమాచారం తెలుసుకున్న నాగరాజు భార్య శాకర్య కుమారి, ఐదేళ్ల కుమార్తె విషీక ఘటనా స్థలానికి చేరుకొన్నారు. ఐదేళ్ల కుమార్తె విషీక తండ్రికి ఏమైంది అని తల్లిని పట్టుకొని బోరున విలపిస్తుండడం అందరితో కంటతడి పెట్టిస్తుంది. మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ వార్తతో వారి గ్రామంలో ఈ దుర్ఘటన గురించే అంతా బాధపడుతున్నారు.