వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో `ది కశ్మీర్ ఫైల్స్` చిత్రాన్ని నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ప్రపంచంలోని హిందూ పండిట్ లకు, ప్రేక్షకులకు చిత్రాన్ని అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో ఈ సినిమా విడుదలైన అన్నిచోట్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ సందర్భం గా అభిషేక్ అగర్వాల్ హైదరాబాద్ లో తన సంస్థ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలను తెలియజేశారు.
ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇంత ఆదరణ చూపిస్తున్న ప్రతి హిందూ పండిట్ లకు, ప్రేక్షకులకు పాదాభివందనాలు తెలియజేస్తున్నా. సినిమా అనేది కమర్షియల్ కానీ 5 లక్షల మంది కశ్మీర్ పండిట్ ల బాధలు, సమస్యలను 32 ఏళ్ళనాటివి బయటకు తెచ్చాను.
సినిమా విడుదలయ్యాక అన్ని చోట్లనుంచి, ముఖ్యంగా తెలుగు చలన చిత్రరంగంలో ఎంతోమంది అభినందలు కురిపించారు. అందుకే ఈ సినిమా పరంగా ఏదైనా అభినందలు వుంటే అది కశ్మీర్ పండితులకు చెల్లుతుంది. త్వరలో దేశంలో అన్ని భాషల్లో డబ్ చేసే ఆలోచన వుంది. తెలుగులోకూడా డబ్ చేయబోతున్నాం.
ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ కశ్మీర్ పండిట్ గా నటించారు. ఆయన పాత్రలో లీనమై పోయారు. షూటింగ్ జరుగుతుండగా అనుపమ్ ఖేర్ ను అక్కడి హిందువులు డిన్నర్ కు ఆహ్వానించేవారు. 90 ఏళ్ళ వృద్ధురాలు కూడా తను ఇంటిదగ్గర వండి భోజనం తీసుకువచ్చేది. ఇలా ఎంతోమంది హిందువులును కలిసి వారితో షేర్ చేసుకున్న సంగతులు నిర్మాతగా నాకు సంతృప్తినిచ్చాయి.