సమ్మక్క- సారలమ్మల చుట్టూ ఒక వ్యాపార సామ్రాజ్యం ఏర్పరిచారు- ఇందులో నిజానిజాలెంత? : Journalist Audi
వ్యాపారం నేర్పించిందే బ్రాహ్మలు- ఇది ఎవరో అన్న మాట కాదు. సాక్షాత్ నన్నయ్య భట్టారకుడు అందించిన ఒకానొక వివరణ.. బ్రాహ్మణుడికి మించిన వ్యాపారి లేనే లేడు, అందరూ వ్యభిచారాన్ని తొలి వ్యాపారంగా అభివర్ణిస్తారు కానీ అది తప్పు.. తొలి వ్యాపారం భక్తి. దాని పెట్టుబడి భయం!!! లేకుంటే అత్యాశ!!! ఈ వివరాలను బట్టీ చూస్తే… ఒక రోజు ఒక రైతు తాను పండించిన ధాన్యపు రాశులన్నిటినీ పొలంలో పోగు చేసి లెక్కలు వేస్తుండగా.. అటుగా ఒక బ్రాహ్మణుడు వెళ్తున్నాడట.. అతడా ధాన్యపు రాశులను చూసి.. ఏది ఏమైనా సరే ఆ ధాన్యంలోంచి తన ఇంటి అవసరాలకు సరిపడా ఒక మూట కాజేయాలని చూశాడట.. అలా అలా ఆలోచించుకుంటూ ఆ కామందు దగ్గరకు వచ్చాడా బ్రాహ్మడు.. ఏం పంతులూ ఇలా వచ్చావని ఆ కామందు అడగ్గానే. ఏముంది దొరా.. మీకు పండిన పంట- రెండింతలు కావడానికి నా దగ్గర ఒక ఉపాయముందని- దాన్నే సత్యన్నారాయణ వ్రతం అంటారనీ. ఈ వ్రతాచరణ చేయవలసిందిగా సూచించాడట.. సదరు బ్రాహ్మణాచార్యుడు. ఎప్పుడు చేయాలి ఎంత ఖర్చవుతుందని ఆ కామందు అడగ్గానే ముఖ్యంగా ఈ వ్రతాన్ని పౌర్ణమినాడు చేయాలనీ.. అందుకు ఇన్ని బస్తాల మోయనా బియ్యం ఖర్చవుతుందని అన్నాడట.. ఆ బ్రాహ్మణశ్రేష్టుడు.. రెండింతలవుతుందనగానే ఎగిరి గంతేసిన కామందు ఓయస్ అలాగే చేసేద్దాం అన్నాడట.. అలా పుట్టుకొచ్చినవే ఈ పూజలు వ్రతాలు నియమాలు.. అన్నది ఒక నానుడి..
ఎదుటి వాడు మనం చెప్పేది సత్యమే అని నమ్మడానికి వీలుగా సత్యన్నారాయణ వ్రతం అన్నది కనిపెట్టారన్నది ఒక చరిత్ర. ఇలా ఎదుటి వారి నుంచి ఏ మాత్రం శ్రమలేకుండా కేవలం బుద్ధి బలంతో మాత్రమే ధన- కనక- వస్తు- వాహనాదులను, కాజేయటం అన్నది ఈ సమాజానికి తొలిగా నేర్పింది, చేసి చూపిందీ సదరు బ్రాహ్మణ వర్గీయులే.. తొలి వ్యాపారి బ్రాహ్మణుడు.. ఇది నిర్వివాదాంశం. అందుకెన్నో తైత్తరీయ సిద్ధాంతాల అల్లిక- గజి బిజి పోలికలు తెరపైకి తెచ్చింది బ్రాహ్మణుడే. ఇదింకో నిర్వివాదాంశం. కొందరు ఇలా అయాచితంగా వచ్చిన సొమ్మును తిరిగి సామాజిక సేవలకే వాడ్డం తెలిసిందే.. ఇప్పటికే మన దక్షిణాదిలో ఎన్నో పెద్ద పెద్ద పీఠాలు.. తాము ప్రోగు చేసిన సొమ్ముతో విద్య- వైద్యం- ఇతర సామాజిక కార్యక్రమాలను చేపట్టడం గురించి విధితమే.. మరీ ముఖ్యంగా కొన్ని పురాతన పీఠాలైతే.. ఏకంగా లక్ష కోట్ల సామ్రాజ్య నిర్మాణాలను చేసిన విషయం గమనార్హమే.. ఇవి ప్రస్తుతం ఏ రేంజిలో ఉన్నాయంటే.. ఒక రిలెయన్స్, మరో టాటా గ్రూప్, ఇంకో బిర్లా గ్రూప్ లకు ఏ మాత్రం తీసి పోవన్నంత స్థాయిలో ఉండటం విశేషం.. కాబట్టి చిన్న జీయర్ రెండో మాట కూడా తప్పే.. అంతెందుకు ఆయన తన రామానుజ విగ్రహానికి అనుమతి రుసుము 150 రూపాయలు పెట్టాడు. ఇక సమ్మక్క- సారలమ్మలను దర్శించడానికి ఏ గుడీ గోపురం లేదు- సరిగ్గా అదే సమయంలో వారిని చూడ్డానికి ఏ రుసుమూ చెల్లించక్కర్లేదు. అంటారు… కానీ సమ్మక్క- సారలమ్మ జాతరలోనూ రెండు వ్యాపార సూత్రాలున్నాయి.. వాటిలో మొదటిది బెల్లం కాగా- రెండోది హుండీ ఆదాయం. ఈ సారికి హుండీ ఆదాయం పది కోట్లు రాగా..
ఈ మొత్తంలో కొంత సమ్మక్క- సారలమ్మల పూజారి వర్గాలకు వెళ్తాయి.. ఇక బెల్లం కాంట్రాక్టుల సంగతి సరే సరి.. ఆ మాటకొస్తే ఇక్కడ జీయర్లైనా ఒకటే.. గిరిజన పూజారులైనా ఒకటే.. వీళ్లలో ఎవరూ నంగనాచి తుంగ బుర్రలు కారు..జాతర మేడారానికి మారిన చరిత్ర ఎలాంటిదనిన !
ఆ మాటకొస్తే 1942కు ముందు సమ్మక్క జన్మస్థలమైన బయ్యక్క పేటలో చందా వంశస్తులు జాతర ఇక్కడే జరిపేవారనీ.. అయితే ఇక్కడ జాతర చేయడానికి గిరిజన పూజారులకు(కరవు కాటకాల కారణంగా) తగిన శక్తి సామర్ధ్యాలు సన్నగిల్లడం వల్ల- ఒక ఒప్పందం ప్రకారం- 1942 తర్వాత మేడారానికి జాతర తరలి వెళ్లిందనీ.. ఇప్పటికీ ఈ జాతరలో వచ్చిన డబ్బులు కొంత వాటా బయ్యక్కపేట పూజారులకు ఇవ్వాల్సి ఉందనీ అంటారు. అంటే తొలిగా బ్రాహ్మలు నేర్పిన భక్తి- వ్యాపార సూత్రం. తర్వాతి రోజుల్లో గిరిజనులకూ పాకిందన్నమాట..
ఇక్కడ వాడేంటి- వీడేంటీ? అందరూ అందరే.. అని గుర్తించాలి మనం.