‘ఏదీ… ఒక్కసారి నీ చుట్టూ నువ్వు స్పీడుగా తిరుగు…’ అని ఎవరితోనైనా అంటే ‘తిక్కతిక్కగా వుందా? నేను కళ్లు తిరిగి పడిపోతే చూడాలని వుందా?’ అని తిడతారు ఎవరైనా… అలాంటిది ఒక అడుగు కాదు, రెండడుగులు కాదు ఏకంగా హెలీకాప్టర్ నుండి దూకేయాలనే ఆలోచన ఎవరికైనా వస్తుందా? అది నిజంగా క్రేజీ ఆలోచన కాదు, ఒళ్లు జలదరించే సాహసం. కానీ, ఆ సాహసాన్ని సరదాగా చేసేవాడి గురించి మీరెప్పుడైనా విన్నారా? ఇప్పుడు వినండి.
ఆ సాహసికుడు అమెరికాకు చెందిన కీత్ కెబె ఎడ్వర్డ్ స్నైడర్ స్కై సర్ఫింగ్ చేస్తుంటాడు. అంటే వేల అడుగుల ఎత్తున ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నుంచి దూకి నేల మీదకు సర్ఫింగ్ చేస్తున్నట్టుగా రావడమన్నమాట. ఈ క్రమంలోనే తాజాగా తన కాళ్లకు సర్ఫింగ్ బోటును కట్టుకుని.. తలకిందులుగా హెలికాప్టర్ స్పిన్స్ అంటే సర్ఫింగ్ బోట్ హెలికాప్టర్ పైన బ్లేడ్లలా తిరుగుతూ, కింద తాను గుండ్రంగా తిరుగుతుండడమన్నమాట… ఆ సాహసం కీత్ కెబె ఎడ్వర్డ్ స్నైడర్ చేశాడు.
గత నెలలో వర్జీనియాలోని ఆరెంజ్ కౌంటీలో హెలికాప్టర్ నుంచి దూకి ఒకే దఫాలో ఏకంగా 175 రివర్స్ స్పిన్స్ చేశాడు. ఇతను 2021లో కూడా ఈజిప్ట్‌లోని గిజాలో పిరమిడ్ల సమీపంలో ఇలాంటి ప్రయత్నమే చేశాడు. అయితే అప్పట్లో 165 చుట్లు తిరగగా.. ఇప్పుడు ఆ రికార్డును అధిగమించాడు. గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఈ ఫీట్ ను హెలికాప్టర్ లోంచి పరిశీలించడంతోపాటు వీడియోను చిత్రీకరించారు. దీనిని ఇటీవలే తమ యూట్యూబ్ చానల్ లో అప్ లోడ్ చేశారు.