South Korea : దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా హాలోవీన్ వేడుకల్ని నిర్వహిస్తారు. కాగా ఇదే రీతిలో శనివారం రాత్రి కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఒక ఇరుకైన వీధి నుంచి వెళ్తుండగా… అకస్మాత్తుగా తొక్కిసలాట జరిగినట్లు దక్షిణ కొరియా అధికారులు వెల్లడించారు. ఈ తొక్కిసలాటలో ఏకంగా 149 మంది మరణించగా…150 మందికి పైగా గాయపడ్డారు. కాగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. తొక్కిసలాట తరువాత ఎక్కువ మంది ప్రజలు గుండె పోటుకు గురయ్యారని దీంతో కొందరు ఊపిరాడక చనిపోయినట్లు తెలిపారు.
ఈ ఘటనపై దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. గాయపడిన వారికి త్వరితగతిన చికిత్స అందించాలని, పండుగ ప్రదేశాల్లో భద్రతను సమీక్షించాలని అధికారులకు సూచించారు.ఈ మేరకు దాదాపు 400 మంది అత్యవసర సిబ్బందిని, 140 వాహనాలను రంగంలో దించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. లీసుర్ జిల్లాలోని ఇటావోన్‌లో జరిగిన తొక్కిసలాట తరువాత సియోల్‌లోని ఆసుపత్రులకు గాయపడ్డవారిని తరలించినట్లు ప్రకటించారు. మృతుల్లో 13 మందిని ఆసుపత్రులకు తరలించామని, మిగిలిన వారి మృతదేహాలు ఇంకా వీధుల్లోనే ఉన్నాయని చెప్పారు.
కాగా తొక్కిసలాట అనంతరం సియోల్‌లో భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు ప్రజలు ఊపిరాడని పరిస్థితుల్లో రోడ్లపై పడిపోతుండగా… అక్కడికక్కడే గుండె (సీపీఆర్) చికిత్సలు అందిస్తున్నారు. హాలోవీన్ ఉత్సవాలు జరిగే ప్రాంతం ఇటావాన్ లోని ఓ బార్‌కు ఒక సెలబ్రిటీ వచ్చారన్న సమాచారంతో ప్రజలు అక్కడకు వెళ్లేందుకు ఒక్కసారిగా పరుగులు తీయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుతుంది. ఈ హాలోవీన్ వేడుకలకు దాదాపు లక్షమంది వరకు హాజరయ్యారని మీడియా వెల్లడించింది.